చెన్నారావుపేట, డిసెంబర్ 21 : మండలంలోని తిమ్మరాయనిపహాడ్ గ్రామంలో పునీత రాయప్ప దేవాలయం (చర్చి) క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. రాష్ట్రంలో రోమన్ కేథలిక్ చర్చిల్లోకెల్లా ఇది మూడో అతిపెద్దది. ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్దది. వరంగల్ జిల్లాలో రోమన్ కేథలిక్ చర్చిల్లో ఇదే పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పునీతరాయప్ప చర్చిలో ఈనెల 24వ తేదీన శుక్రవారం, 25న శనివారం రెండురోజుల పాటు క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 24న రాత్రి 11 గంటలకు ప్రత్యేక ప్రార్థన చేసి, రాత్రి 12 గంటలకు భారీ కేక్‌ను కట్‌చేసి ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు, పెద్ద సంతోషంగా పాల్గొంటారు. 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లు నూతన వస్ర్తాలు ధరించి ఉదయం 9 గంటలకు చర్చికి వచ్చి ప్రత్యే క ప్రార్థనలు నిర్వహిస్తారు. ఏసుక్రీస్తు వృత్తాంతాన్ని చర్చి ఫాదర్ యాగారెడ్డి తన సందేశం ద్వారా వివరిస్తారు. గ్రామంలోని క్రిస్టియన్లు తమ ఇండ్లపై రంగురంగుల స్టార్లను ఏర్పాటు చేసుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా చర్చితోపాటు ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. చర్చిలో స్వాగత తోరణం, బాలయేసు మందిరం, బాలయేసుతో మేరీమాత ఉన్న చిన్న ఆలయాలను విద్యుత్ లైట్లతో కనువిందుగా ఏర్పాటు చేశారు. ఏసుక్రీస్తు జన్మించిన పశువులపాక(క్రిబ్)ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.