రూ. 14.50 కోట్లతో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి
టెండర్లు పిలిచిన జీడబ్ల్యూఎంసీ అధికారులు
వరంగల్, డిసెంబర్ 15 : ఉర్సు రంగసముద్రం, ఉర్సు గుట్ట ప్రాంతాలు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. ఉర్సు గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు జీడబ్ల్యూఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉర్సు చెరువు ( రంగసముద్రం)తో పాటు పక్కన ఉన్న రంగలీల మైదానం, ఉరు గుట్టపై ఉన్న రంగనాయకుల దేవాలయ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూ. 14.50 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో పిలిచిన టెండర్లను ఈనెల 20న తెరువనున్నారు. ఉర్సు చెరువు, గుట్టతో ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఈ ప్రాంతాన్ని గ్రేటర్ అధికారులు టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయనున్నారు. మైసూర్ తర్వాత అంత వైభవంగా ఉర్సు గుట్ట ప్రాంతంలో రావణ వధ కార్యక్రమం దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హృదయ్, స్మార్ట్‌సిటీ నిధులతో హనుమకొండ ప్రాంతంలోని భద్రకాళి బండ్, వడ్డేపల్లి బండ్‌ను అభివృద్ధి చేసి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నారు.
రెండో దఫా పిలిచిన టెండర్లు
10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉర్సు గుట్ట ప్రాం తాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు గ్రేటర్ అధికారులు టెండర్లు పిలిచారు. గతంలో టెండర్లు పిలిచినా రీ కాల్ అయ్యాయి. రెండో దఫా పిలిచిన టెండర్లను ఈ నెల 20న తెరువనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
అండర్ రైల్వేగేట్ ప్రాంతానికి కొత్త శోభ
ఉర్సు గుట్ట పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో అండర్ రైల్వేగేట్ ప్రాంతం కొత్త శోభ సంతరించుకోనుంది. రైల్వేగేట్ దిగువ ప్రాంతంతో పాటు విలీన గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రతి ఉదయం వందలాది మంది రంగలీల మైదానంలో వాకింగ్ చేస్తుంటారు.
ఆహ్లాదానికి కేరాఫ్‌గా ఉర్సు గుట్ట
ఆహ్లాదానికి కేరాఫ్‌గా ఉర్సు గుట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే సినిమా యూనిట్లు ప్రీ రిలీజ్‌కు రంగలీల మైదానాన్ని వేదికగా చేసుకుంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ అధికారులు కన్వెన్షన్ హాల్, కల్చరల్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ జోన్, ఫుడ్ కోర్ట్, ఓపెన్ జిమ్, పిల్లల ఆడుకునేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ప్రతి ఏటా మహిళలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా బతుకమ్మ జోన్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేశారు. రావణ వధ ఉత్సవం నిర్వహించేందుకు ప్లాట్ఫారం, సందర్శకుల కోసం టాయిలెట్లను నిర్మాణం చేపట్టనున్నారు. వాటితోపాటు రంగలీల మైదానాన్ని చదును చేసి గ్రీనరీతో అందంగా తీర్చిదిద్దనున్నారు. ఉర్సు చెరువులో పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించి బండ్ నిర్మించనున్నారు. ట్యాంకుబండ్ తరహాలో చెరువు, గుట్ట అందాలను వీక్షించేలా సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గుట్టకు శాశ్వతంగా రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చనున్నారు. దీంతో రాత్రి వేల ఉర్సు గుట్ట దేదీప్యమానంగా వెలిగిపోనుంది.