హనుమకొండ, డిసెంబర్ 15: వరంగల్, నర్సంపేటలో ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా చేసేందుకు మేఘా గ్యాస్ సన్నాహాలు చేస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పట్టణాల్లో ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా చేస్తామని మేఘా గ్యాస్ టెక్నికల్ హెడ్ జీ రాజ్‌కుమార్ చెప్పారు. బుధవారం హనుమకొండలోని నకలగుట్టలో శ్రీ ప్రతాపరుద్ర ఆటోమోటివ్స్‌లో మేఘా గ్యాస్ కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) విక్రయ కేంద్రాన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రిటైల్ సేల్స్ విభాగం డీజీఎం కేఎస్వీ భాసరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రారంభించిన ఔట్లెట్ వరంగల్, హనుమకొండలో మూడోదని చెప్పారు. త్వరలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో పది సీఎన్జీ ఔట్లెట్లను ప్రారంభిస్తామని తెలిపారు. వరంగల్, నర్సంపేటలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు అనువుగా ప్రస్తుతం పైపులైన్ వేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి వరంగల్, హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రహదారుల్లో ప్రతి 20 కిలో మీటర్లకు ఒక సీఎన్జీ విక్రయ కేంద్రాన్ని మేఘా గ్యాస్ ప్రారంభిస్తుందన్నారు. ఖమ్మంలోని రోటరీనగర్, దంశాలపురం, ఖమ్మం బస్టాండ్ వద్ద మేఘా గ్యాస్ సీఎన్జీ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మూడు సీఎన్జీ విక్రయ కేంద్రాలకు అదనంగా మరో 10 కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. అనంతరం భాసరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం వాహనాలకు సీఎన్జీని వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. తమ సంస్థ పెట్రోల్ బంకుల్లో సీఎన్జీ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆటోమోటివ్స్ యజమాని ప్రభాకర్, వినయ్‌కుమార్, హరీశ్ పాల్గొన్నారు.