సుబేదారి/నల్లబెల్లి, డిసెంబర్ 15 : ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్, వివిధ కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి అండగా నిలిచింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో టీవీ 9 కెమెరా మన్ కేశబోయిన శ్రీనివాస్, ఐన్యూస్ పరకాల రిపోర్టర్ సామాల శ్రవణ్, జనం సాక్షి కమలాపూర్ విలేకరి గట్టు మహేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తే తెలంగాణ విలేకరి చిలుపూరి జగన్, మహబూబాబాద్ జనం సాక్షి విలేకరి డీ శ్రీనివాస్, వరంగల్ తూర్పు నియోజకవర్గ టీన్యూస్ రిపోర్టర్ పొన్నం ప్రవీణ్, ఉషోదయం విలేకరి బిట్ల రాజమౌళి, ఏబీఎన్ ఆంద్రజ్యోతి జనగామ విలేకరి ఉల్లెంగుల అంజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఈనాడు విలేకరి ఆమంచ ఓంప్రకాశ్ కుటుంబ సభ్యులకు రూ.రెండు లక్షల చొప్పున, నల్లబెల్లి మండలానికి చెందిన ఓ పత్రిక విలేకరి ఓడపెల్లి గోపికిషన్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. ప్రమాదాల్లో గాయపడిన ముగ్గురు జర్నలిస్టులకు రూ.50వేల చొప్పున అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కిరణ్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, టెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, తడుక రాజనారాయణ, మస్కపురి సుధాకర్, మెండు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.