ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు 200 ఎకరాలు కేటాయించాలి
జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
ఫారెస్టు, రెవెన్యూ అధికారులతో సమావేశం
భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 15 : రెవెన్యూ, ఫారెస్టు భూములను వీడియో, ఫొటోగ్రఫీ ద్వారా కొన్నేండ్లుగా సర్వే చేస్తున్నామని త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. బుధవారం ఆయన అదనపు కలెక్టర్ దివాకర, జేసీ కూరాకుల స్వర్ణలత, డీఎఫ్‌వో లావణ్య, ఆర్డీవో శ్రీనివాస్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్, రెవెన్యూ భూవివాదాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టేకుమట్ల మండలం వెలిశాల సర్వే నంబర్ 203, 207, భూపాలపల్లి మండలంలో సర్వే నంబర్ 405, 406 భూ సమస్యలపై సమగ్ర సర్వే జరిపి భూ వివాదాలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. మహాముత్తారం మండలం ములుగుపల్లి గ్రామ సర్వే నంబర్ 168 లో 200 ఎకరాల భూమి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం సర్వే చేసి ఫారెస్ట్ సంబంధించిన జీవోలు, తదితర నివేదికలతో వెంటనే సమర్పించాలని డీఎఫ్‌వోను ఆదేశించారు. అలాగే భూపాలపల్లిలో స్విమ్మింగ్ పూల్ మంజూరు నిమిత్తం ప్రభుత్వ భూమి సర్వే నంబర్లు 417, 418, 419లో 4 ఎకరాల 9 గుంటలు భూమిపై సంబంధిత తహసీల్దార్ ఆధ్వర్యంలో చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ రవికుమార్, భూపాలపల్లి తహసీల్దార్ ఇక్బాల్, రెవెన్యూ, ఫారెస్ట్, సర్వేల్యాండ్ అధికారులు పాల్గొన్నారు.