స్థానికత ఆధారంగానే బదిలీలు
లైన్‌క్లియర్ చేస్తున్న రాష్ట్ర సర్కారు
ఇప్పటికే జోనల్, మల్టీ జోనల్, జిల్లా పోస్టులపై స్పష్టత
ఇకపై 95శాతం ఉద్యోగులకు స్థానిక రిజర్వేషన్ల వర్తింపు
కాళేశ్వరం జోన్లోకి ములుగు జిల్లా
ములుగు, డిసెంబర్15(నమస్తేతెలంగాణ) : స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విధివిధానాలు ఖరారు చేయడం.. ఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులపై సర్కారు స్పష్టత ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన మార్గదర్శకాల ప్రకారం 95 శాతం ఉద్యోగులకు స్థానిక రిజర్వేషన్ వర్తించనుండగా ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని సీనియారిటీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టనున్నారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన జరుగనున్న ది. జిల్లాస్థాయి పోస్టుల కేటాయింపునకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉండే కమిటీలో ఆయా శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. జోనల్, మల్టీజోనల్ పోస్టుల విభజనను సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగానే విభజన జరుగనున్నది. దివ్యాంగులు, సంతానంలో ఎవరైనా మానసిక దివ్యాంగులు ఉన్నవారు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జిల్లాలోని ఉద్యోగులంతా కాళేశ్వరం జోన్ పరిధిలోకి రానున్నారు. 50 ఏళ్లకు పైగా ఉమ్మడి రాష్ట్రంలో క్యాడర్ స్ట్రెంత్ పోస్టులు లేక సర్దుబాటులో ఉద్యోగాలు చేసి విసిగిపోయిన ఉద్యోగులకు కొత్త జోనల్ వ్యవస్థను అమల్లోకి తేవడంతో ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ నెల చివరికల్లా పూర్తి స్థాయిలో జోనల్ వ్యవస్థ కార్యాచరణ పూర్తి కానున్నది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి విభజన చేపట్టనున్నారు. దీంతో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ కానున్నది.
ఏ జిల్లా ఉద్యోగులు.. ఆ జిల్లాకే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాలు జరుగకపోవడం సహా ఇంజినీరింగ్, వైద్యం, విద్య ప్రవేశాల్లో పాత 10 జిల్లాలు, రెండు జోన్ల విధానంలోనే చేపట్టారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఆర్డర్ టు సర్వ్ విధానంతో ఉ ద్యోగుల కేటాయింపులు జరిగాయి. కొత్త జోనల్ విధా నం ఆమోదం పొందడంతో ఇకపై జిల్లాలు, జోన్ల వారీ గా ఉద్యోగుల సంఖ్య ఖరారై దీని ఆధారంగానే కేటాయింపు ప్రక్రియ ఉండబోతున్నది. కొత్తగా నియమితులయ్యే వారికి జోనల్ కేటాయింపు సులభం కానుంది.
ఉద్యోగాల పునర్ వ్యవస్థీకరణ ఇలా..
టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, లెనో ఆపరేటర్, జమేదార్, చైన్మన్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్మెన్, ఫోర్‌మెన్, కార్పెంటర్, మేస్త్రీ, గార్డెనర్, చౌకీదార్, ప్రింటింగ్ టెక్నీషియన్, కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 వంటి పోస్టులన్నింటిని జిల్లా క్యాడర్లో నిర్ధారించారు. నాయబ్ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఎంఆర్ఐ, ఏఆర్ఐ, సీనియర్ స్టెనో, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సూపరింటెండెంట్, నాన్‌టెక్నికల్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, హెడ్ కానిస్టేబుల్, టెక్నికల్ అసిస్టెంట్, ఏఎస్సై, ఎస్సై, అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్, సీనియర్ డ్రైవర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1,2,3, సబ్ రిజిస్ట్రార్ పోస్టులు గ్రేడ్-2 జోనల్ క్యాడర్లో ఉన్నాయి. ఆర్డీవో, అసిస్టెంట్ సెక్రటరీ, సూపరింటెండెంట్, తహసీల్దార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సీఐ, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఇన్స్ట్రక్టర్, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవో, డీఏవో, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వంటి పోస్టులు జోనల్ పరిధిలో ఏర్పాటయ్యాయి.
ఆహ్వానించదగ్గ పరిణామం
కొత్త జోనల్ విధానం ఆమోదం పొంది కార్యాచరణకు రూపుదిద్దుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. జిల్లాల పునర్విభజన తర్వా త ఆర్డర్ టు సర్వ్ విధానంతో జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఏర్పడింది. జోన్ల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు అయ్యే అవకాశం ఉండడంతో దీని ఆధారంగానే ఉద్యోగుల శాశ్వత కేటాయింపు ప్రక్రియ ఉండనుంది. ఈ విధానంతో కొత్తగా ఉద్యోగాల్లో నియమితులయ్యే వారికి జోనల్ విధానం కేటాయింపు సులభతరం కానున్నది.