ప్రజల విజ్ఞప్తి మేరకే పేరు మార్పు
నగరానికి తలమానికంగా కాజీపేటను తీర్చిదిద్దుతాం
విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
మడికొండ, ఆగస్టు 14 : హనుమకొండ, వరంగల్ జిల్లాలతో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ నగర పర్యటనలో భాగంగా ప్రజల విజ్ఞప్తి మేరకే ముఖ్యమంత్రి జిల్లాల పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కాజీపేటను అన్ని విధాలా అభివృద్ధి చేసి నగరానికి తలమానికంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాజీపేట మీడియా పాయింట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల ఏర్పాటుతో రెండు జిల్లాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ తర్వా త సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భా గంగానే ఎడ్యుకేషనల్, కల్చరల్, టూరి జం, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యం సదుపాయం అందించాలనే లక్ష్యంతో 33 అంతస్తులతో మల్టీ లెవల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు భూమి పూజ కూడా చేసినట్లు గుర్తు చేశారు.
బోడగుట్ట వద్ద అడ్వెంచర్‌తో పాటు క్రీడల నిర్వహణకు టూరిజం అధికారులతో కలిసి సందర్శించి, సమీక్షలు నిర్వహించినట్లు చెప్పా రు. బోడగుట్ట చెరువును సుందరీకరిస్తామని, జ్ఞాన మందిరం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బంధం చెరువు, వడ్డేపల్లి చెరువులో బోటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బోడగుట్ట ప్రజల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, ఇందుకోసం బల్దియా నుంచి రూ.3కోట్లు కేటాయించామన్నారు. కాజీపేట వాసుల చిరకాల వాంఛ వ్యాగన్ పరిశ్రమ, రైల్వే డివిజన్ సాధన, ఫిట్‌లైన్ నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సీఎంరిలీఫ్ ఫండ్ అందించడంలో రాష్ట్రంలోనే పశ్చిమ నియోజకవర్గం రెండు లేదా మూడో స్థానంలో ఉందన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సమావేశంలో అబూబక్కర్, నార్లగిరి రమేశ్, సుంచు కృష్ణ, సోని, బరిగెల వినయ్, మహమూద్, పాము రాజేశ్, బస్వ యాదగిరి, కొండ్ర శంకర్, గబ్బెట శ్రీనివాస్, నయీం జుబేర్, ఎండీ అంకూస్, కోల వినోద, మర్యాల కృష్ణ పాల్గొన్నారు.