చిన్నపిల్లలందరూ కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు
విధులపై అలసత్వం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేత
భూపాలపల్లి జిల్లాలో 644 అంగన్వాడీ కేంద్రాలు
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై దృష్టిసారించింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో సంబంధం లేకుండా ఏడేండ్లుగా పకడ్బందీగా చర్యలు చేపడుతూనే ఉంది. జిల్లాలో 644 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 417 కేంద్రాలతో భూపాలపల్లి, 227తో కాటారం సర్కిళ్లను ఏర్పాటు చేసింది. అంగన్వాడీ టీచర్, సహాయకులు సక్రమంగా పనిచేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర సర్కార్ నిరుపేదలైన గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు చిన్నపిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను రెండు సర్కిళ్లుగా ఏర్పాటు చేసింది. భూపాలపల్లి సర్కిల్లోని ఆరు మండలాల పరిధిలో 417, కాటారం సర్కిల్ పరిధిలో 5 మండలాల్లో 227 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రతి కేంద్రంలో అంగన్వాడీ టీచర్, సహాయకురాళ్లు ఇద్దరి చొప్పున ఉన్నారు. వారు అంగన్వాడీ కేంద్రాలను రెగ్యులర్ నడిపించేలా చర్యలు చేపడుతున్నారు.
ఆకస్మిక తనిఖీలు
జిల్లాలోని 644 అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఏమాత్రం అలసత్వం చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కేంద్రాలను సంబంధిత అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. కేంద్రాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూస్తున్నారు. పాఠశాలలకు వెళ్లలేని చిన్న పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్ ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నారు. కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నారు. జిల్లాలో పర్యవేక్షణ అధికారులు నిరంతరాయంగా తనిఖీలు చేపట్టేలా శాఖాపరంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా&
అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు. చిన్నారులు పౌష్టికాహర లోపంతో బాధ పడుతున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి, సిబ్బంది పర్యవేక్షణలో రెండు నెలల పాటు వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.