ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి
జిల్లా వ్వవసాయాధికారి రాధిక
బచ్చన్నపేట, డిసెంబర్ 11 : కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని మం డల ప్రత్యేకాధికారి, డీఈవో రాధిక సూచించారు. శనివారం మండలంలోని కట్కూర్, లింగంపల్లి, పడమటికేశ్వపూర్ గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ఎంపీవో రఘురామకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాల్సిందేనన్నారు. వ్యాక్సిన్ వేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. ప్రతి రోజూ గ్రామస్థాయి అధికారులు ఫోన్ చేసి సమాచారం అందించడం జరుగుతుందన్నారు. అయినా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. అదే విధంగా అలీంపూర్‌లో పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీలు, వీవోఏలు, ఆశ కార్యకర్తలు ఇం టింటా తిరిగి వ్యాక్సిన్ వేసుకోవాలని ఆవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ముశిని సునీతారాజుగౌడ్, కుందెన మల్లేశం, గిద్దెల రమేశ్, పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్ఆచార్య, పరశురాం, నరేశ్, రేవతిగౌడ్, అంగన్వాడీలు విజయారమాదేవి, వీవోఏలు లలిత, కవిత, ఆశ కార్యకర్తలు ప్రమీల, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్‌ను తరిమేందుకు చిత్తశుద్ధితో పని చేద్దాం
దేవరుప్పుల: కొవిడ్‌ను తరిమేందుకు మండల స్థ్ధాయిలో అన్ని ప్రభుత్వ శాఖలు చిత్తశుద్ధితో పని చేయాల్సినవసరం ఉందని మండల ప్రత్యేకాధికారి కొండల్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కొవిడ్‌పై పలు శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. మండల వైద్యాధికారి జ్ఞానేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల ప్రత్యేకాధికారి కొండల్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రతి రోజూ జిల్లా కలెక్టర్ రివ్యూ ఉంటుందని, ప్రతి రోజూ మనకిచ్చిన టార్గెట్‌లో పురోగతి కనిపించాలన్నారు. కాగా, డిసెంబర్ చివరి నాటికి 2957 మందికి రెండో డోసు టీకాలు వేయాల్సిందని, ఇక మొదటి డోసు 2816 మందికి వేయాల్సి ఉందని, ఈ టార్గెట్ త్వరగా పూర్తి చేయాలని, దీనికి గాను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. అంతకు ముందు మండల స్థాయి కొవిడ్ టీం పలు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో ఉమామహేశ్వర్, వైద్యాధికారి కిశోర్, ఎంపీవో కవికుమార్ ఉన్నారు.