రోడ్ల వెంట వృక్షాల కోసం జనం రాక
పలు రాష్ర్టాల నుంచి కుటుంబాల క్యూ
బంక ఉన్న కొమ్మల సేకరణ కోసం పోటీ
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు..పలు రంగుల తయారీలో కీలకం
హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 11 : వందల ఏళ్ల క్రితం ఓ చెట్టు దక్షిణ అమెరి కాలో పుట్టింది.. మెక్సికో, పెరూ, బ్రెజిల్ దేశాల్లో విస్తరించింది. క్రమంగా మన దేశానికి వచ్చింది. రోడ్ల వెంట నీడ కోసం వాటిని నాటగా ఇప్పుడవి ఎంతో మందికి ఉపాధి చూపుతున్నాయి. ఈ వృక్షాల కొమ్మలకు తయారయ్యే జిగురులాంటి పదార్థం రంగులు, షూ పాలిష్, గాజుల తయారీలో వాడుతుండగా దాన్ని సేకరించేందుకు బీహార్, ఛత్తీస్గఢ్, మన రాష్ట్రంలోని సిద్దిపేట, బాన్సువాడ ప్రాంతాల నుంచి వం దలాది కుటుంబాలు వాహనాల్లో వచ్చి రోజుల తరబడి రోడ్ల వెంటే ఉంటున్నాయి. కేవలం చలి కాలంలోనే లభించే ఈ బంకకు ఎక్కడ లేని డిమాండ్ ఉన్నది. ఈ చెట్టు నుంచి సేకరించిన బంకతోనే పలు కంపెనీలు వివిధ రకాల షూ పాలిష్, రంగు రంగుల గాజులను తయారుచేస్తున్నాయి. దీంతో ఆ జిగురు కోసం కొందరు వాహనాల్లో వచ్చి రోడ్ల వెంట ఉన్న చెట్లపైకి ఎక్కి చిటారు కొమ్మలను విరిచి దానికి ఉండే బంకను తీస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లలో ఈ ప్రక్రియ నెల రోజులుగా నడుస్తున్నది. ఇలా సేకరించిన బంకను పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, కర్ణాటకలోని బెంగళూరుకు తరలిస్తున్నారు. సేకరించిన బంకకు మధ్య దళారులు కిలోకు రూ.1000 నుంచి రూ. 1500 దాకా చెల్లిస్లున్నారు. దళారులకు మాత్రం భారీగానే గిట్టుబాటు అవుతుందని సేకరించేవారు చెబుతున్నారు. ఈ బంకతో తయారు చేసిన గాజులు, షూ పాలిష్ అత్యంత నాణ్యతగా ఉండడంతో దీన్ని కొనేందుకు ఆయా కంపెనీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న వారు ప్రమాదకరమైనప్పటికీ నడుముకు తాళ్లు కట్టుకుని మరీ ఈ చెట్లు ఎక్కి కొమ్మలను నరికి వాటికి ఉండే బంకను తీసి అమ్ముకుంటున్నారు. వాహనాలను కిరాయి తీసుకుని వస్తున్న వీరు కొన్ని రోజుల పాటు అనుకూల ప్రదేశాల్లో నివాసం ఉండి బంకను సేకరించుకుని వెళ్తున్నారు. ఇక్కడ పని చేసే వారిలో ఒక్కొక్కరికి నిత్యం రూ. రెండు వేల వరకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.
నిద్రమాను, నిద్ర గన్నేరుగా ప్రసిద్ధి
మన దగ్గర నీడ కోసం రహదారులకు ఇరువైపులా పూర్తిగా ఈ చెట్లనే నాటుతుం టారు. తక్కువ సమయంలో ఈ చెట్టు పెరిగి విస్తరిస్తుంది. స్థానికంగా వీటిని నిద్రమా ను, నిద్రగన్నేరు చెట్లు అని పిలుస్తారు. దక్షిణ అమెరికా నుంచి మెక్సికో, పెరూ, బ్రెజిల్ దేశాలకు ఇది విస్తరించి మన దేశానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీని శాస్త్రీయనామం ‘సమానే సమన్’ కాగా వర్షపు చెట్టు అని, మంకీ ప్యాడ్ అని కూడా పిలుస్తారు. గొడుగు ఆకారంలో ఉండే ఈ చెట్టు 25 మీటర్ల దాకా ఎత్తు పెరిగి 30 మీటర్ల వరకు విస్తరిస్తుంది. రోడ్ల పక్కన, ఉద్యాన వనాల్లో మంచి నీడనిస్తుంది. బలమైన గాలులు వచ్చినప్పుడు మాత్రం ఇవి ఎక్కువగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అవెన్యూ ప్లాంటేషన్లలో ఎక్కువగా ఈ చెట్లనే నాటుతారు. ఈ చెట్ల ఆకులకు సాయంత్రం నుంచి ఉదయం వరకు ముడుచుకుపోయే గుణం ఉంటుంది. అందుకే దీన్ని ప్రజలు నిద్రమాను అని పిలుస్తుంటారు.
కరువు కాలంలో అక్కరుకు
ఇప్పుడు మా ఊర్లో పనుల్లేవు. గిట్ల చెట్టు పుల్లలతోని రోజూ కొంత గిట్టుబాటవుతున్నది. వారం పది రోజులు ఇటే ఉండి మూడు నాలుగు కింటాళ్ల కొమ్మ లు అయినంక ఇంటికి పోతం. రాత్రి పూట ఎక్కన్న న్న మంచి జాగ సూసుకొని పండుకుంటం. ఆటో తీసుకుని వచ్చినం. మేం ఇంటికి వెళ్లిన తర్వాత సేటు కు ఫోన్జేత్తె వాళ్లు వచ్చి మేం పుల్లల నుంచి తీసిన బంకను తీస్కపోతరు. కిలో బంకకు వెయ్యి నుంచి పదిహేను వందలు కట్టిస్తరు.
రంగులు తయారు జేస్తరట
మేం దీన్ని నల్ల దర్శన్ చెట్టు అంటం. దీని కొమ్మల నుంచి వచ్చే బంకతోటి రంగులు తయారు జేస్తరట. మేం ఊరూరు తిరిగి బంకను తీస్కపో తం. తర్వాత సేట్లు వచ్చి మాకు పైసలిచ్చి కొంట బోతరు. ఆళ్లకు ఎంత లాభం వత్తదో మాకైతే తెల్వ ది. పిల్లల్నిడిసి పెట్టి అచ్చినం. మళ్లా పది పదిహేను దినాలకు ఇంటికి పోతం. వేరెటోళ్లు శానమందే తిరుగుతాన్లు. మనిషికింత పని దొరుకుతాంది.