బ్లాక్ ఫంగస్ రోగులకు డాక్టర్ల విస్తృత సేవలు
సీనియర్లు తమ అనుభవాలను విద్యార్థులకు నేర్పించాలి
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి
కేఎంసీలో ఈఎన్టీ రాష్ట్ర సదస్సు
పాల్గొన్న 400 మంది వైద్యులు, 250 పరిశోధనా పత్రాలు సమర్పణ
వరంగల్, డిసెంబర్ 11: ప్రపంచాన్ని వణికించిన కరోనా.. వైద్య రంగానికి ఎన్నో పాఠాలు నేర్పిందని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ మెడికల్ కళాశాల ఎన్ఆర్ఐ భవనంలో 6వ రాష్ట్రస్థాయి ఈఎన్టీ సదస్సు నిర్వహించారు. కరుణాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా అనేక వేరియంట్లలో భాగంగా బ్లాక్ ఫంగస్ విస్తరిస్తున్న సమయంలో ఈఎన్టీ డాక్టర్లు ధైర్యంగా రోగులకు చికిత్స చేశారని అన్నారు. 24 గంటలు అపరేషన్ థియేటర్లలో ఉంటూ సర్జరీలు చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ల విజ్ఞప్తులపై వెంటనే స్పందించి అవసరమైన మందులను అందుబాటులో ఉంచి పేదలకు మెరుగైన చికిత్స అందేలా చేసిందన్నారు. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేలా విపత్కర కాలంలో డాక్టర్లు సేవలందించారని, దీంతో సమాజంలో వారిపై గౌరవం పెరిగిందని అన్నారు. వైద్య రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ డాక్టర్లు జూనియర్లు, విద్యార్థులకు తమ అనుభవాలను నేర్పించాలని, అది పుస్తకాలతో రాదని అన్నారు. రాబోయే తరానికి మంచి ఈఎన్టీ డాక్టర్లను అందించేలా సీనియర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈఎన్టీ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ కరోనా కాలంలో అసోసియేషన్ కార్యక్రమాలు కొంత తగ్గాయని, అయిప్పటికీ జూమ్ ద్వారా మార్గదర్శకం చేశామని అన్నారు. డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రమేశ్, కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పరశురామ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుదీప్, డాక్టర్ వినీల్ రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ, ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సీనియర్ ఈఎన్టీ డాక్టర్లు రమణాచారి, సుదర్శన్‌రెడ్డి, రమేశ్‌కుమార్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
250 పరిశోధనా పత్రాలు
ఈఎన్టీ రాష్ట్ర సదస్సులో 250 మంది పరిశోధనా పత్రాలను సమర్పించారు. కరోనా వైరస్ తర్వాత వస్తున్న వేరియంట్లపై వైద్యులు సమగ్రంగా మాట్లాడారు. అప్పుడు ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు చికిత్సలో తీసుకున్న చర్యలను వివరించారు. సుమారు 400 మంది డాక్టర్లు సదస్సుకు హాజరయ్యారు. రెండో రోజు ఆదివారం చెన్నై, ముంబైలో చేసే సర్జరీలను సదస్సులో లైవ్ టెలికాస్ట్ ద్వారా చూపించనున్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఈఎన్టీ డాక్టర్లను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి సన్మానించారు. సదస్సులో వివిధ సర్జికల్ కంపెనీలు పెద్ద ఎత్తున స్టాళ్లు ఏర్పాటు చేశాయి.