పెద్దపులి ఉండొచ్చురెండురోజులుగా కళేబరాలను తినొచ్చని అనుమానిస్తున్న అటవీ శాఖ అధికారులు
కొనసాగుతున్న గాలింపు
కాటారం, డిసెంబర్ 11: పెద్దపులి ఇంకా కాటారం మండలంలోనే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల కింద మల్హర్ మండలం మీదుగా కాటారం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన పెద్దపులి అటు అటవీ శాఖ అధికారులను, ఇటు గ్రామస్తులను హడలెత్తిస్తోంది. మండలంలోని వీరాపూర్, గుమ్మళ్లపల్లి ప్రాంతాల్లో కనిపించిన పెద్దపులి మరుసటి రోజే శివారులోని రెండు మూగజీవాలపై దాడి చేసి చంపింది. దీంతో కాటారం డీఎస్పీ బోనాల కిషన్, జిల్లా అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలోకి వెళ్లి పులి అడుగు జాడలను గుర్తించారు. పెద్దపులే దాడి చేసి చంపినట్లు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమై ఎలాగైనా పెద్దపులిని పట్టుకోవాలనే ఉద్దేశంతో అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈమేరకు డిప్యూటీ రేంజర్ మధుబాబు ఆధ్వర్యంలో అడవిలో పులి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల కింద పెద్దపులి చంపిన గేదె, దున్నల కళేబరాలు ప్రస్తుతం అక్కడ లేనట్టు తెలుస్తోంది. ఈ రెండు రోజులుగా కళేబరాలను లాక్కెళ్లి ఆరగిస్తూ పరిసరాల్లో తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో బర్లు, గొర్రెల కాపరులు మూగ జీవాలను మేత కోసం అటవీ ప్రాంతాల్లోకి తోలుకెళ్లడంలేదు. పెద్దపులి జాడను కనుగొనేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ట్రాప్ కెమెరాలకు కూడా చిక్కడంలేదు.