భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల విషయంలో మొండి వైఖరి అవలంభిస్త్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. శనివారం మండలంలోని మోరంచపల్లిలో జంగేడు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేనందున రైతులు అనువైన చోట ఇతర పంటలు సాగు చేయాలని, కేంద్రం యాసంగిలో వడ్లు కొనేది లేదని, వరి పంటలు వేయొద్దనడం సరికాదన్నారు. రాష్ర్టాల్లో రైతులు పండించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి ఎగుమతులు చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు. రాష్ర్టాలు కొనుగోలు చేసి ఎగుమతి చేయవని గుర్తు చేశారు. రైతులు మాత్రం సాధ్యమైనంత వరకు వరి సాగును తగ్గించుకోవాలని , ఇది డిమాండ్ కాదని రైతుల బాగోగులను దృష్టిలో ఉంచుకుని చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య,
జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజిరెడ్డి, అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మందల విద్యాసాగర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాంపెల్లి శ్రీనివాస్, సర్పంచ్ లకిడె కమలాబాయి వెంకన్న, టీఆర్ఎస్ నేతలు పైడిపల్లి రమేశ్, నూనె రాజు, ఇర్ఫాన్, స్వామి, సీఈవో సల్ల రవీందర్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.