ఓర్వలేకే విపక్షాల ఆరోపణలు
కాంగ్రెస్, బీజేపీకి గుణపాఠం చెప్పాలి
పాలకుర్తిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతా
త్వరలోనే రిజర్వాయర్లను పూర్తి చేయిస్తా
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి రూరల్, డిసెంబర్ 11: సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.కోటితో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఆనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైస్కూటర్లు, 183 మంది అంగన్వాడీ టీచర్లకు రూ.18.30 లక్షల విలువైన స్మార్ట్ఫోన్లను ఎర్రబెల్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయని పనులను ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేశారని గుర్తు చేశారు. అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాల విమర్శలను రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. వ్యవసాయరంగానికి ఉచితంగా 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్నామని, గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేశామన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో సీఎం కేసీఆర్ రైతును రాజు చేస్తున్నాడని ఆయన వివరించారు.
త్వరలోనే రిజర్వాయర్ల పూర్తి
వచ్చే వర్షాకాలంలోపు పాలకుర్తి, చెన్నూరు, ఉప్పుగల్లు రిజర్వాయర్లను పూర్తి చేయిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే రిజర్వాయర్ల పనుల్లో ఆలస్యం చేశారని మండిపడ్డారు. పాలకుర్తిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతానని, అవసరమైతే అదనపు నిధులను మంజూరు చేస్తానని చెప్పారు. పాలకుర్తి నియోజక వర్గంలో విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తానన్నారు, ఇక్కడ 100 పడకల దవాఖాన, జూనియర్, డిగ్రీ కళాశాలను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పాలకుర్తి నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. యాసంగిలో వరి వేయవద్దని సూచించారు. రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలన్నారు. దివ్యాంగులు, మ హిళలు, వృద్ధుల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు సీఎం కేసీఆర్ వేతనాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, డీపీవో రంగాచారి, మార్కెట్ డీఎం నాగేశ్వర శర్మ, సీడీపీవో జయంతి, డీఈలు శ్రీనివాస్, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస్‌రావు, కొడకండ్ల జడ్పీటీసీ కేలోతు సత్తమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, పీఏసీఎస్ చైర్మన్ గోనె మైసిరెడ్డి, వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, మేడారపు సుధాకర్, గుగులోతు దేవానాయక్, డైరెక్టర్లు మెతుకు రాజు, దేవరాజు, తహసీల్దార్ ఎన్ విజయభాస్కర్, ఎంపీడీవో వీ ఆశోక్‌కుమార్, గంట పద్మభాస్కర్, నాయిని మల్లారెడ్డి, పుస్కూరి పార్వతి, పన్నీరు సమ్మయ్య, ఒంటేల మాధవి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, జర్పుల బాలూనాయక్ పాల్గొన్నారు.