ఏజెన్సీ గ్రామాలకు వరంలా 317 జీవో
ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలకు 71మంది ఉపాధ్యాయుల కేటాయింపు
ఈ మండలాల నుంచి 24మంది ఇతర జిల్లాలకు
ఏళ్ల తరబడి ఉన్న ఖాళీలు భర్తీ
ఉన్నత పాఠశాలల్లో తీరిన సబ్జెక్ట్ టీచర్ల కొరత
పీడీలు సైతం సర్దుబాటు
మారుమూల గ్రామాల్లో విద్యకు జవసత్వాలు
ఏటూరునాగారం, జనవరి 11 : అన్ని సంఘాల ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ‘317’ జీవోపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీకి ఈ జీవో కారణంగా బాగయ్యే బడుల భవిష్యత్ కనిపించడం లేదేమో..! వాటిపై ఆధా రపడిన పిల్లల ఉన్నతి ఆ పార్టీకి పట్టదేమో..! ఏళ్ల తరబడి పంతుళ్లు లేక సతమతమైన ఏజెన్సీ గ్రామాల పాఠశాలలకు ఈ జీవో వరంలా మారిందనేందుకు ఇదిగో ఉదాహరణ.. ములు గు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలంలోని మెజార్టీ బడులకు రెగ్యులర్ టీచర్లు లేక ఇన్నేళ్లూ వలంటీర్లు, డిప్యుటేషన్లతో నెట్టుకొచ్చారు. తాజాగా ఈ రెండు మండలాలకు 71మంది ఉపాధ్యాయులను కేటాయించడంతో మారుమూల గ్రామాల బడులకు మోక్షం లభించింది. ఇక్కడి విద్యార్థుల చదువులకు భరోసా దొరికినట్లయింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 317 ఏజెన్సీ గ్రామాలకు వరంలా మారింది. నాలుగేళ్లుగా పంతుళ్లు లేని పాఠశాలలకు మోక్షం లభించింది. ఏజెన్సీలో వెనుకబడిన చదువులు ఇక ముందుకు సాగనున్నాయి. గిరిజన గ్రామాల్లో విద్య మెరుగు పడనుంది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలకు 317 జీవోతో 71 మంది ఉపాధ్యాయులు కొత్తగా వచ్చారు. ఇక ఏటూరునాగారం మండలంలో పనిచేస్తున్న 20 మందిని, కన్నాయిగూడెం మండలంలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయులను ఇతర జిల్లాలకు కేటాయించారు. ఏటూరునాగారం మండలానికి 35 మంది, కన్నాయిగూడెం మండలానికి 36 మంది ఉపాధ్యాయులు కొత్తగా వచ్చారు. జడ్పీ ఉన్నత పాఠశాల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్లు భర్తీ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం నెలకొంది. ఏటూరునాగారం మండలం ఇప్పలగడ్డ, ముల్లకట్టలోని మండల పరిషత్ పాఠశాలలకు నాలుగేళ్లుగా రెగ్యులర్ ఉపాధ్యాయులు లేక వలంటీర్లు, డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను నియమించి కొనసాగించారు. ముల్లకట్టలో రెండు పోస్టులకు గాను ఒక్కరు, ఇప్పల గడ్డలో నాలుగు పోస్టులకు ఒక్కరు చొప్పున ఇప్పుడు రెగ్యులర్ ఉపాధ్యాయులు వచ్చారు. కన్నాయిగూడెం మండలం ఏటూరు, సింగారం, లక్ష్మీపురం,దేవాదులలోని మండల పరిషత్ పాఠశాలల్లో పోస్టులు ఖాళీ ఉండగా ఆయా పాఠశాలలకు కేటాయింపులు పూర్తయ్యాయి. కన్నాయిగూడెం మండలం గూర్రేవుల జడ్పీ ఉన్నత పాఠశాలలో 8పోస్టులకు గాను నలుగురే ఉండగా, తాజాగా మరో ముగ్గురు ఉపాధ్యాయులు వచ్చారు. ముప్పనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 13 పోస్టులకు గాను ఇప్పటి వరకు ఐదుగురే ఉండగా, తాజాగా ఏడుగురు వచ్చారు. ఏటూరునాగారం జడ్పీ ఉన్నత పాఠశాలలో 33 పోస్టులకు గాను 11 పోస్టులు ఖాళీ ఉండగా కొత్తగా ఆరుగురు వచ్చారు.
రెండు మండలాల్లో ఖాళీలు భర్తీ
ఏటూరునాగారం మండలంలో 36 పోస్టులకు గాను ఇందులో ఎస్జీటీ 20, ఉర్దూ మీడియం పాఠశాలలో ఎస్జీటీ, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్లు తెలుగు, హిందీ, పీడీ, బయో సైన్స్, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, హిందీ పండిట్లు కొత్తగా వచ్చారు. కన్నాయిగూడెం మండలంలో కొత్తగా వచ్చిన 35 పోస్టుల్లో 26 మంది ఎస్జీటీలు ఉన్నారు. ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు, బయో సైన్స్, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ టీచర్లు ఇద్దరు చొప్పున వచ్చారు. ఒక పీఈటీ పోస్టు కూడా భర్తీ అయింది. ఏటూరునాగారం ఉన్నత పాఠశాలలో ఆరేళ్లుగా ఖాళీ ఉన్న అటెండర్ పోస్టు కూడా భర్తీ అయింది. ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ పోస్టు కూడా మంజూరైంది.