రైతుబంధు అన్నదాతల పాలిట వరం
సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలు పచ్చదనం
తెలంగాణలోనే రైతులకు ఆత్మగౌరవం
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి
గర్మిళ్లపల్లి నుంచి టేకుమట్ల వరకు భారీ బైక్ ర్యాలీ
టేకుమట్ల, జనవరి 10 : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌తోనే కరువునేలల్లో బంగారు పంటలు పండుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని గర్మిళ్లపల్లి నుంచి టేకుమట్ల వరకు రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే గండ్ర దంపతులు హాజరయ్యారు. అనంతరం మండలకేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితిలోనూ రాష్ట్ర ప్రభ్వుం రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమచేసిందని గుర్తు చేశారు. గతంలో సాగునీరు, కరెంట్ లేక, ఎరువులు దొరకక, గిట్టుబాటు ధర, పంటలు సరిగా పండక రైతులు ఆత్మహత్యలు చేసుకునేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ వారు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తున్నదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు అనవసరపు రాద్ధాంతాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇక్కడ ఉన్న వారే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న నాయకులు వారి రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ రైతుల అభ్యన్నతి కోసం పనిచేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు అలజడి సృష్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, వారిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. అనంతరం మండలంలోని 56 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
బాధిత కుటంబాలకు పరామర్శ
మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వేశాల రాజనర్సు, దుబ్యాల గ్రామానికి చెందిన కలమ్మ, ఆరుముళ్ల కాంతమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే గండ్ర దంపతులు పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కూర సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్ల రవిగౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గునిగంటి మహేందర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సంగి రవి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.