గడపగడపకు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు
35కుపైగా స్కీంలతో సకలజనులకు మేలు
రైతుల ఆర్థికాభివృద్ధికి అనేక చర్యలు
‘ఆసరా’తో ధీమాగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు
పేదింట పెండ్లి రంది తీర్చిన కల్యాణలక్ష్మి
కాన్పు భారం దించిన కేసీఆర్ కిట్లు
కులవృత్తులకు కొత్త వెలుగులు
విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు
ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులు
అందరిబాగు కోసం వేలాది కోట్లు వెచ్చిస్తున్న సర్కారు
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ);అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి బాంధవుడయ్యారు. చెరువులను బాగు చేసి, గోదావరి జలాలను పొలాలకు మళ్లించి.. పెట్టుబడి సాయం అందించి రైతన్నకు పెన్నిధిలా.. బీమా చేయించి అన్నదాత కుటుంబానికి అండగా నిలిచారు. కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డ పెండ్లి రంది తీర్చారు. సౌకల సౌకర్యాల సర్కారు దవాఖానల్లో పురుడు పోయించి.. ఆర్థిక సాయం కూడా అందిస్తూ తల్లిదండ్రులకు బిడ్డ కానుపు భారం దించారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల జీవనానికి ‘ఆసరా’ అయ్యారు. వనరులు, వసతులు సమకూర్చి కులవృత్తులకు జీవం పోశారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసి.. గురుకులాలు నెలకొల్పి కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తూ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు 35 రకాల పథకాలను కొనసాగిస్తూ ప్రపంచమే తెలంగాణవైపు చూసేలా చేశారు.
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా చారిత్రక పథకాలు ప్రవేశపెట్టింది. ఏడేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలు అమలు చే సింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమం కో సం ప్రపంచం విస్తుపోయే పథకాలు ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు, ఒంటరి మహిళలకు పింఛన్, రైతు బంధు, రైతు బీమా, దశలవారీగా దళితబంధు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు, సబ్సిడీపై వాహనాలు, ప్రతి ఒక్కరికీ ఆరుకిలోల బియ్యం, విద్యార్థులకు సన్నబియ్యం, డబుల్బెడ్రూం ఇండ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధి లాంటి కార్యక్రమాలు అమలు చేశారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి వేతనాలు పెంచేలా ప్రణాళికలు రచిస్తోంది. మాతాశిశు సంరక్షణ కోసం రూ.15 వేల విలువైన 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌ను పంపిణీ చేసింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన 90 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అర్హులైన రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేసింది. అంతేగాకుండా ముందస్తు పెట్టుబడి కింద రెండు విడుతలుగా ఎకరానికి రూ.10వేల చొప్పున సాయం అందజేస్తున్నారు. రైతన్నను కష్టాల నుంచి గట్టెక్కించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్‌శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు దరఖాస్తు చేసుకున్న రైతలందరికీ కరంట్ కనెక్షన్ ఇస్తున్నారు.
కులవృత్తులకు కొత్త వెలుగు..
తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహించడానికి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. అన్ని వృత్తులకు సమ ప్రాధాన్యం ఇస్తున్నది. చేనేత, గౌడ, బ్రాహ్మణ వంటి సంఘాలకు భవనాలు నిర్మించింది. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితం రజకులు, నాయీబ్రాహ్మణుల దుకాణాలకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తామని ప్రకటించింది. రజకుల లాండ్రీ షాపులు, నాయీబ్రాహ్మణుల దుకాణాలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. ఆ మేరకు లాండ్రీ, సెలూన్ దుకాణాలదారుల తరుపున కరంటు బిల్లు రూ.2.20లక్షలను విద్యుత్ శాఖకు సర్కారు చెల్లించింది.
కోటి ఎకరాలకు సాగు నీరు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కోటి ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో జయశంకర్ భూపాలపల్లి జి ల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారు. బొగ్గుల వాగు, గణపసముద్రం, భీమ్‌ఘన్‌పూర్ చెరువులను రిజార్వాయర్లుగా మార్చి సాగు నీరు అందిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా రూ. 132 కోట్ల వ్యయంతో 317 చెరువులను అభివృద్ధి చేసి 27,134 ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. రైతుల సం క్షేమం కోసం ప్రభుత్వం రూ.50 వేల లోపు పంటల రుణాలను తీసుకున్న 9,558 మంది రైతులకు రూ.29.55 కోట్ల రుణాలు మాఫీ చేసింది. వానకాలం సీజన్లో 1,03,813 మంది రైతులకు రూ. 111.79 కోట్ల రైతు బంధు పెట్టుబడి సాయం అందించింది. రైతు బీమా ద్వారా 861 మంది రైతు కుటుంబాలకు రూ.43.05 కోట్లను పరిహారంగా అందించింది. జిల్లాలో 454 రైతు వేదికల ను నిర్మించింది. సీఎం గిరి వికాసం పథకం ద్వారా రూ.9.5 కోట్లతో 334 బోరుబావులను మంజూరు చేశారు. 2020-21 యాసంగి సీజన్లో 1,35,535 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 206 కొనుగోలు కేంద్రాల ద్వారా 26,725 రైతుల నుంచి కొనుగోలు చేసి రూ. 255.84 కోట్లు చెల్లించింది.
ఆహ్లాదంగా పల్లెలు, పట్టణాలు
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదంగా ఉన్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో రూ.58 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. జిల్లాలో 241 వైకుంఠధామాలు, 382 పల్లె ప్రకృతి వనాలు, 241 షెగ్రిగేషన్ షెడ్లు, 1,377 కల్లాల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. తెలంగాణాకు హరితహారంలో భాగంగా జిల్లాలో 241 గ్రామ పంచాయతీల్లో 22.10 లక్షల మొక్కలు నాటి 81శాతం లక్ష్యానికి చేరుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను సమకూర్చారు. జిల్లాలో 3,882 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రూ. 153.30 కోట్లు మంజూరు కాగా 873 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
సత్వర భూ సేవలకు ధరణి పోర్టల్
రైతాంగానికి సత్వర భూసేవలను అందించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా తహసీల్దార్‌కు అధికారం బదలాయించి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సులుభతరం చేశారు. అంతేకాకుండా పట్టాదారు పాసు పుస్తకాలు అంద చేస్తున్నారు. ధరణి లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్లు, నాలా, పెండింగ్ పట్టా మార్పులు, పార్టిషన్లు మొత్తం 2,24,639 దరఖాస్తులు స్వీకరించి 1.29,085 ఎకరాలకు పట్టా పాసు పుస్తకాలు జారీ చేశారు.
రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం
జిల్లాలో1.24,352 కుటుంబాలకు 277 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ చేస్తూ ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీరుస్తున్నది. ప్రస్తుతం మూడు మండలాల్లో బలవర్ధకమైన ఆహారంతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం అందిస్తున్నారు. ఏజెన్సీ మండలాలైన మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని 410 ఆవాసాల్లో 1,06,712 ఇళ్లకు శుద్ధమైన తాగునీరు అందిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 80,845 మంది కూలీలకు 1,65,990 పని దినాలను కల్పించి రూ. 31.45 కోట్లు చెల్లించారు.
53,159 మందికి ఆసరా పింఛన్లు
దివ్యాంగులు, వయో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితర రకాల 53,159 మందికి ప్రతి నెలా రూ.12,04 కోట్ల పింఛన్లు ఇస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక మహిళా సంఘాలకు 920 సంఘాలకు రూ. 36.26 కోట్ల బ్యాంకు లింకేజీలు, 2.41 కోట్ల స్త్రీనిధి రుణాలు, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 41 గ్రూపులకు రూ.1.67 కోట్ల రుణాలను అందించారు. జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా 9501 మంది రూ. 80.82 కోట్లు, షాదీముబారక్ పథకాల ద్వారా 362 లబ్ధిదారులకు రూ.2.93 కోట్లు అందిస్తున్నారు. జిల్లాలో 469 ప్రభుత్వ, 70 ప్రైవేట్ పాఠశాలలో 45,874 మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు.
కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో భూపాలపల్లిలోని నూతన వైద్యశాల భవనంలో మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ప్రసూతి సేవలతో పాటు ఐసీయూ వార్డు ఏర్పాటు చేసి అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. 589 అంగన్వాడీ, 55 మినీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా 4,446 మంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. 19,080 మంది చిన్నారులకు బాలామృతంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. సఖి కేంద్రం ద్వారా నిరాదరణకు, దాడులకు గురైన 174 మంది మహిళలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.