బీజేపీ నేతల ఝూటా మాటలు నమ్మొద్దు
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందంజ
ప్రధాని మోదీ రైతుల అభ్యున్నతికి కృషిచేయాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి
చిట్యాల మండలం చల్లగరిగె, జూకల్ గ్రామాల్లో బైక్‌ర్యాలీ
చిట్యాల, జనవరి 8 : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి రాష్ట్రంలోని బీజేపీ గల్లీ నాయకులు సిల్లీ మాటలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శనివారం వరంగల్ జడీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి మండలంలోని చల్లగరిగెలో ఎడ్ల బండితో ర్యాలీగా వచ్చారు. అక్కడి నుంచి జూకల్ గ్రామ రైతు వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్పంచులు పుట్టపాక మహేందర్, కర్రె మంజూల అధ్యక్షతన నిర్వహించిన రైతుగోష్టి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, రైతుబంధు పథకం అన్నదాతల పాలిట వరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.50వేల కోట్ల పైచిలుకు నగదు రైతుల ఖాతాల్లో జమైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కుటుంబాలకు దూరంగా ఉండి వ్యవసాయ పనులు చేసుకునేదని, ప్రత్యేక రాష్ట్రంలో 24గంటల కరెంట్ ఇస్తుండంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో దేశానికంటే తెలంగాణ ముందంజలో ఉండడంతో ఓర్వలేని కొందరు బీజేపీ గల్లీ నాయకులు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో అన్నా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
మన్‌కీబాత్ అని చెప్పుకునే ప్రధాని మోదీ జర కామ్కీబాత్తో రైతులపై శ్రద్ధచూపి వారి అభ్యున్నతికి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు అలజడి సృష్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, వారిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. వారి మాటలకు మోసపోవద్దని, రానున్నరోజుల్లో సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలన్నారు. అనంతరం వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంకల్పంతో గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. అదే స్ఫూర్తితో రైతులు ఇతర పంటలవైపు మొగ్గు చూపి అధిక లాభాలు పొందాలన్నారు. కులవృత్తులను బలోపేతం చేస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్, ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ నల్ల సమ్మిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కామిడీ రత్నాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు జంబుల తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామాశాఖ అధ్యక్షులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.