రోహిణి ఆస్పత్రి నర్సింగ్ కాలేజీ హాస్టల్లో ఘటన
కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని విద్యార్థి సంఘాల నాయకుల ఆరోపణ
వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితురాలు
సుబేదారి, జనవరి 8 : హనుమకొండ సుబేదారిలోని రోహిణి హాస్పిటల్‌కు చెందిన నర్సింగ్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దవాఖానలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య పోరాడుతున్నది. ఈఘటన వెలుగులోకి రాకుండా యాజమాన్యం పలుకుబడితో అనేక ప్రయత్నాలు చేస్తున్నదని, ముందు జాగ్రత్తగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయించుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో సుమారు 200 మంది నర్సింగ్ విద్యార్థినులు ఉంటున్నారు. ఈ ఘటనతో రోహిణి హాస్పిటల్ నర్సింగ్ కళాశాలను పర్యవేక్షించే ఇద్దరిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థిని రవళి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కాందారపు రవళి (19) సుబేదారిలో రోహిణి హాస్పిటల్ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్నది. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు తల్లితో వీడియో కాల్లో మాట్లాడింది. తను చనిపోతున్నా అని ఫోన్ పెట్టేసి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థినులు గమనించి వెంటనే రవళి కుటుంబ సభ్యులకు చెప్పారు. తోటి విద్యార్థినులు ఆస్పత్రికి తీసుకొచ్చి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. రవళి ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికిది కాదని, హాస్టల్ ఇన్చార్జి, ప్రిన్సిపాల్ మానసిక వేధింపులకు గురిచేయడంతో తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఇన్చార్జి రాంరెడ్డి, ప్రిన్సిపాల్ చైతన్యపై కేసు
నర్సింగ్ కళాశాల ఇన్చార్జి రాంరెడ్డి, ప్రిన్సిపాల్ చైతన్య వేధింపులతోనే తన కూతురు రవళి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె తండ్రి తిరుపతి శనివారం సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కూడా ఇదే విషయం నా బిడ్డ చెప్పింది.. ఇంత జరిగినా హాస్పిటల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు.. పైగా పోలీసులతో హాస్పిటల్ నుంచి బయటకు పంపించిందని ఆయన ఆరోపించాడు. వారిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరాడు. ఈ మేరకు ఇన్చార్జి రాంరెడ్డి, ప్రిన్సిపాల్ చైతన్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన..
రవళి ఆత్మహత్యాయత్నానికి కారకులైన నర్సింగ్ కళాశాల ఇన్చార్జి రాంరెడ్డి, ప్రిన్సిపాల్ చైతన్యపై చర్య లు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హాస్పిటల్ ఎదుట టీజీవీపీ, బీఎస్ఎఫ్, టీఎంవీస్, టీఎస్ఎఫ్, కేయూ విద్యా ర్థి సంఘాల నాయకులు శనివారం ధర్నా చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పీఎస్‌కు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు మేడ రంజిత్, కాడపాక రాజేందర్, ఇట్టబోయిన తిరుపతి, ఏకు ప్రవీణ్, వినోద్, కన్నం సునీల్ పాల్గొన్నారు.