వరంగల్, జనవరి 8 : అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పలు శాఖల అధికారులను ఆదేశించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన తూర్పు నియోజవర్గ అభివృద్ధి పనులపై కార్పొరేటర్లతో సమీక్షించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై డివిజన్ల వారీగా సమీక్షించిన ఆయన ప్రజల అవసరాలకు అనుగుణంగా వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను వేగవం తం చేయాలన్నారు. నియోజవవర్గ అభివృద్ధికి విడుదలైన నిధులు వృథా కాకుండా సద్వినియోగమయ్యేలా అంచనాలు వేసి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే తూర్పు నియోజవర్గంలోని స్మార్ట్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, వాటిని నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు గుండేటి నరేందర్, మరుపల్ల రవి, సురేశ్ జోషి, బాల్నె సురేశ్, ఫుర్ఖాన్, పల్లం పద్మ, పోశాల పద్మ, బోగి సువర్ణ, కావేటి కవిత, ముష్కమల్ల అరుణ, బల్దియా డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.