భూవివాదమే కారణం
నిందితుల్లో అన్నాసాగర్ సర్పంచ్ భర్త
వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి
సుబేదారి, జనవరి 7 : వ్యక్తిని హత్య చేయడానికి యత్నించిన ఆరుగురు సభ్యులు గల ముఠాలో నలుగురిని హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ డాక్టర్ తరుణ్‌జోషి వివరాలను వెల్లడించారు. హసన్‌పర్తి మండలం అన్నసాగర్ గ్రామ సర్పంచ్ భర్త బండ జీవన్‌రెడ్డి నకిలీ దస్తావేజులతో గ్రామ శివారులోని నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని సొంతం చేసుకుని విక్రయించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పొలం పక్కనే అదే గ్రామానికి చెందిన నల్లా శ్యాంసుందర్.. కొనుగోలుదారులకు జీవన్‌రెడ్డి పొలం వివాదంలో ఉందని చెప్పాడు. జీవన్‌రెడ్డి కక్ష పెట్టుకుని అన్నాసాగర్‌కు చెందిన మరో ఇద్దరు నిందితులు వంశీకృష్ణ, అనిల్‌ను సంప్రదించాడు. వంశీకృష్ణకు స్నేహితుడైన అజ్గర్‌తో శ్యాంసుందర్‌ను హత్యచేయడానికి పథకం రచించాడు. ఇందుకు జీవన్‌రెడ్డి వంశీకృష్ణ ద్వారా అజ్గర్‌కు రూ.40 వేలు అందించాడు. అజ్గర్ తనకు తెలిసిన అక్బర్, సైలానిని కలిసి డిసెంబర్ 30న శ్యాంసుందర్‌ను పొలం వద్ద వెంబడించి తీవ్రం గా కొట్టారు. ఆయన మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయారు. శ్యాంసుందర్ ఫిర్యాదు మేరకు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, హసన్‌పర్తి పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునే క్రమంలో శుక్రవారం నల్లగుట్ట వద్ద వాహన తనిఖీలో వరంగల్ రంగంపేటకు చెందిన ఎండీ అక్బర్, అన్నాసాగర్‌కు చెందిన జీవన్‌రెడ్డి, హనుమకొండకు చెందిన తాటం వంశీకృష్ణ, మరో బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, హసన్‌పర్తి పోలీసులను సీపీ అభినందించారు.
కరోనాపై జాగ్రత్తగా ఉండాలి
విధి నిర్వహణలో పోలీసులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి సూచించారు. కరోనాతో చనిపోయిన పోలీసు అధికారులు భాస్కర్‌రావు, దక్షిణమూర్తి సంస్మరణ సభ శుక్రవారం భీమారంలోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు సీపీ, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు, దక్షిణమూర్తి అందించిన సేవలను సీపీ గుర్తుచేశారు. ఐపీఎస్ ఆఫీసర్లు సాయిచైతన్య, వైభవ్‌గైక్వాడ్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, జర్నలిస్టులు బీఆర్ లెనిన్, అనిల్‌గౌడ్, అధికారులు పాల్గొన్నారు.