రైస్‌మిల్లర్స్ జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు
హైదరాబాద్‌లో మంత్రులు ఎర్రబెల్లి, గంగులను కలిసి వినతి
వరంగల్, జనవరి 7(నమస్తేతెలంగాణ) : రైస్‌మిల్లర్స్ జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలిశారు. తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా 2020-21 యాసంగికి సంబంధించి డెలివరీ చేయాల్సిన బియ్యం అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో 44.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు టార్గెట్ ఇస్తే తొమ్మిది నెలలుగా తాము 32.52 లక్షల టన్నులు మాత్రమే డెలివరీ చేయగలిగామన్నారు. ఇంకా 12.23 లక్షల టన్నులు డెలివరీ చేయాల్సి ఉందని, జిల్లాలోని రైస్‌మిల్లర్లకు విధించిన 1.50 లక్షల టన్నుల రైస్ టార్గెట్‌లో 1.26 లక్షల టన్నుల రైస్ డెలివరీ చేశామని తెలిపారు. బ్యాలెన్సు ఉన్న 24 వేల టన్నులు కూడా రా రైస్ పెట్టాలని అధికారులు పేర్కొంటున్నారని వివరించారు. యాసంగి ధాన్యం దిగుమతి చేసుకున్నప్పుడే రా రైస్ డెలివరీ చేయలేమని, బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వగలమని ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు గుర్తుచేశారు. ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాల్సి ఉన్న 12.23 లక్షల టన్నుల రైస్‌లో రాష్ట్రం యూనిట్‌గా ఫస్ట్ కం ఫస్ట్ నిర్ణయించి బాయిల్డ్ రైస్ తీసుకుంటే పౌరసరఫరాల సంస్థకు రుణభారం తగ్గి ఆర్థిక మేలు కలుగుతుందని వివరించారు. బ్యాలెన్స్ బాయిల్డ్ రైస్ వెంటనే తీసుకోవాలని కోరారు. మంత్రులను కలిసిన వారిలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, పాడి గణపతిరెడ్డి, ప్రతినిధులు పోల్సాని వెంకటేశ్వర్రావు, కనకందుల ప్రదీప్‌రావు, మామిండ్ల గోపి తదితరులు ఉన్నారు. కాగా, రైస్‌మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు తోట సంపత్‌కుమార్ వెల్లడించారు.