జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగుటౌన్, జనవరి7: గ్రామ సభల ద్వారా ఇసుక సొసైటీలను గుర్తించాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు 7 ఐటీడీఏ ట్రై కార్ కార్పొరేషన్ సంస్థ ద్వారా డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇచ్చినప్పటికీ అటవీ శాఖ అధికారులు ఎకో సెన్సిటివ్ జోన్‌లోని రీచ్‌ల అనుమతికి నిరాకరించారని కలెక్టర్ తెలిపారు. అటవీ శాఖ అధికారుల వద్ద కచ్చితమైన ఆధారాలు ఉంటే ఈ నెల 12న నిర్వహించనున్న సమావేశానికి తీసుకురావాలని అన్నారు. జిల్లాలో ఇసుక రీచ్‌ల అనుమతి కోసం 262 దరఖాస్తులు రాగా 139 ఫైనల్ అయ్యాయని పెండింగ్‌లో ఉన్న 123 దరఖాసులను త్వరగా జాయింట్ తనిఖీలు నిర్వహించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా 6 ఇసుక ఏరియాలను గుర్తించినట్లు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు పంపిన నివేదికలు పలు మార్లు మార్పులు చేస్తున్నారని నివేదికలు వెల్లడించే ముందు పరిశీలించుకోవాలని అన్నారు. పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక రీచ్‌లను రద్దు చేస్తే కచ్చితమైన ఆధారాలు చూపాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మైనింగ్ ఏడీ రవిబాబు, డీసీవో సర్ధార్ సింగ్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, డీఐ రాజనర్సయ్య, అధికారులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు కలెక్టర్ ఆర్థిక సాయం
ములుగుటౌన్: గిరిజన క్రీడాకారులకు శుక్రవారం కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఆర్థిక సాయం అందజేశారు. అంతర్జాతీయ క్రికెట్‌జట్టులో స్థానం సంపాదించిన అజ్మీరా ప్రేమ్ సాగర్ అండర్-19 జట్టు (ఇండియా)కేప్టెన్‌గా వ్యవహరించి నేపాల్‌లో జరిగిన క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. కరాటేలో స్వారింగ్లో రెండో స్థానంలో నిలిచిన కోరం నాగవాసు, అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు తెలంగాణ నుంచి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తాటి కృష్ణవేణికి ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈనెల 16 నుంచి 20 వరకు నేపాల్‌లో జరిగే 6 దేశాలు పాల్గొనే ఇండో నేపాల్ చాంపియన్ షిప్ ట్రోఫీలో వారు పాల్గొనన్నారు. వారి వెంట పెసా జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ఉన్నారు.