రైతు బంధు వారోత్సవాల్లో ఎంపీపీ
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 7: ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో శుక్రవారం రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని దీంతో రాష్ట్రం రైతు రాజ్యంగా మారిందని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్ అన్నారు. ములుగులోని రైతు వేదికలో రైతుబంధు సంబురాల్లో పాల్గొని ముగ్గుల పోటీని ఆమె ప్రారంభించారు. రైతు బంధు సమితి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పళ్లా బుచ్చయ్య, మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ములుగు పట్టణ అధ్యక్షుడు చిన్న విజయ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు మండలంలోని బండారుపల్లి మోడల్ పాఠశాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏవో) కేఏ గౌస్‌హైదర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు, వ్యారచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ శోభారాణితో కలిసి బహుమతులను అందించారు. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మంగపేట మండలంలోని కమలాపురంలో పార్టీ శ్రేణులు సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. రాజుపేటలో ఏఈవో జ్యోతి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలోని మరికాల, పాత్రాపురం, ఆలుబాక గ్రామాల్లోని రైతు వేదిక భవనాల వద్ద మహిళలు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కాటారం మండలంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. జిల్లా మార్కెటింగ్ ఇన్చార్జి అధికారి కనక శేఖర్ ఆధ్వర్యంలో రైతులు పంతకాని సడవలి, బొక్కల పోశిరెడ్డి తదితరులను శాలువాలతో సన్మానించారు.
మహదేవపూర్ మండలకేంద్రంలోని రైతువేదిక ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. రైతు బంధు సమితి మండల కన్వీనర్ బండం లక్ష్మారెడ్డి, మహదేవపూర్ వైస్ ఎంపీపీ బండం పుష్పలత, మహదేవపూర్ వ్యవసాయాధికారి ప్రభావతి పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్‌లో జడ్పీటీసీ గై రుద్రమదేవీ అశోక్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఏఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు. లక్ష్మీదేవిపేటలోని ఉన్నత పాఠశాలలో రైతు బంధు సమితి అధ్యక్షుడు వీరగాని సాంబయ్య ఆధ్వర్యంలో, పాలంపేటలో ఏవో కల్యాణి, హెచ్ఎం కుమారస్వామి ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్, వల్లెంకుంట ప్రభుత్వ పాఠశాల, పెద్దతూండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఏవో ముంజ మహేశ్ పర్యవేక్షించారు. సోమవారం బహుమతులు అందజేస్తామని తెలిపారు. రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.