అంబరమంటిన రైతుల అభిమానం
నార్లు వేసి, ముగ్గులేసి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు
ప్రేమతో రైతుబాంధవుడికి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
పెట్టుబడి సాయం చేస్తున్న సర్కారుకు దీవెనలు
కేక్ కట్ చేసి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సత్యవతి
ఉత్తమ రైతులకు ప్రజాప్రతినిధుల సన్మానం
గణపురంలో వేడుకగా ట్రాక్టర్ల ర్యాలీ
జనగామలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు, విజేతలకు బహుమతులు
ఆయాచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు అరూరి, ముత్తిరెడ్డి, రాజయ్య, శంకర్‌నాయక్, గండ్ర
జయశంకర్ భూపాలపల్లి/ములుగు, జనవరి 7 (నమస్తే తెలంగాణ);‘రైతుబంధు’ తెచ్చి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కర్షకలోకం పల్లెపల్లెనా పబ్బతి పడుతున్నది. అదునుకు ఆసరా అయ్యేలా పెట్టుబడి సాయం ఇస్తున్న రైతుబాంధవుడికి జేజేలు పలుకుతున్నది. ఈ సందర్భంగా ఊరూరా నిర్వహిస్తున్న రైతుబంధు సంబురాల్లో పాల్గొంటూ తీరొక్క రీతిలో కృతజ్ఞత తెలుపుతున్నది. వారోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతులు ‘జై కేసీఆర్’, ‘జై రైతుబంధు’ అక్షరమాలలో నారుపోసి, చిత్రపటాలకు పాలాభిషేకం చేయగా.. బాలికలు, మహిళలు రైతు వేదికలు, పాఠశాలల్లో ఉత్సాహంగా ముగ్గులేశారు. అలాగే మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతిరాథోడ్, మిగతా చోట్ల ఎమ్మెల్యేలు.. ఉత్తమ రైతులను సన్మానించడంతో మురిసిపోగా, గణపురంలో ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ర్యాలీలతో హోరెత్తించారు.
రైతుబంధు వారోత్సవాలు ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటుతున్నాయి. శుక్రవారం ఊరూరా సంబురాలు హోరెత్తాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పంట పొలాల్లో ‘జై కేసీఆర్’, ‘జై రైతుబంధు’ అని రాసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వందలాదిగా ఊరేగింపు తీసి రైతుబాంధవుడికి జైకొట్టారు. అలాగే రైతువేదికలు, పాఠశాలలు, ఇళ్ల ముందు ఆడబిడ్డలు ముచ్చటగొలిపే ముగ్గులు వేసి అభిమానం చాటుకున్నారు.
మహబూబాబాద్‌లో రైతుబంధు సంబురాల్లో మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి కేక్ చేసి, ఉత్తమ రైతులకు సన్మానం చేశారు. ఆ తర్వా జిల్లాకేంద్రంలోని గాయత్రీగుట్ట నుంచి ఏటిగడ్డతండా వరకు మహిళలు కోలాటం ఆడుతూ ర్యాలీ తీశారు. ఉపన్యాసం, వ్యాసరచన, ముగ్గుల పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులిచ్చి ఉత్సాహం నింపారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి ప్రసాదరావు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఉత్తమ రైతులను సన్మానించారు. ఆ తర్వాత వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేయించి సంతోషం నింపారు. సంబురాల్లో భాగంగా పర్వతగిరి మండలం కల్లెడలో నిర్వహించిన మహిళల కబడ్డీ పోటీలకు హాజరై వారిలో జోష్ నింపారు. చింతనెక్కొండలో రైతులు ఎడ్లబండ్ల ర్యాలీ జోరుగా నిర్వహించారు.
జనగామ జిల్లాలో ‘రైతుబంధు’ ముగ్గులు ముచ్చటగొలిపాయి. జిల్లాకేంద్రంలోని ధర్మకంచ జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, ముగ్గుల పోటీల్లో బాలికలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తీరొక్క నినాదంతో వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి విజేతలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున బహుమతులు అందజేశారు. ఒక్క రోజే నియోజకవర్గంలోని 136 గ్రామాలు, పాఠశాలల్లో ముగ్గులు వేసి సర్కారు పథకాలను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆడబిడ్డలు దీవించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చిల్పూర్ మండలం పల్లగుట్టలో ఎడ్లబండ్ల ర్యాలీలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జఫర్‌గఢ్ మండలం కూనూరులో ముగ్గుల పోటీలకు హాజరయ్యారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో సంబురాలు పండుగలా జరిగాయి. మండలకేంద్రం నుంచి సాయిబాబా ఆలయం వరకు వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి స్వయంగా నడుపుతూ ఉత్సాహం నింపారు. అనంతరం వ్యవసాయంలో ఉత్తమ ఫలితాలు సాధించిన 18మందిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల విజేతలకు బహుమతులు అందించారు.
మోటర్ రిపేర్ చేయించిన..బావి పూడిక తీయించిన వేముల ఉప్పలయ్య మనోగతం
బయ్యారం జనవరి 7 : రైతుబంధు రైతులకు మస్తు అక్కరకొత్తాంది. పంటల సాగు సమయం వచ్చే సరికి ఠంఛన్‌గా బ్యాంకు ఖాతాల పడుతున్నయ్. ఎదురుచూసే పనిలేకుంట అదునుకు వచ్చి ఆసరైతానయ్. మాకు ఐదున్నర ఎకరాల భూమి ఉంది.. అందులో వరి, మిర్చి పంటలు సాగుచేస్తున్నా.. ప్రతి యేడు 55వేలు వత్తానయ్. మొదటి యేడాది వచ్చిన పైసలతోని బావి పూడిక తీయించిన. మోటారు రిపేర్ చేయించిన. సాగునీరు కూడా పుష్కలం పారుతానయ్. రైతులకు రంది లేకుంట జేశిండు సీఎం కేసీఆర్ సార్.