దేశంలో ఎక్కడాలేని పథకాలు రాష్ట్రంలో అమలు
కేసీఆర్ ప్రాణమున్నంత వరకు రైతుబంధు ఆగదు
ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం
నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు..
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
మానుకోటలో ఘనంగా రైతుబంధు సంబురాలు
పాల్గొన్న ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్
మహబూబాబాద్, జనవరి7 : రైతులు ధనవంతులు కావాలనే దేశంలో ఎక్కడాలేని పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. గాయత్రిగుట్ట నుంచి ఏటిగడ్డతండా సమీపంలోని రైతువేదిక వరకు ర్యాలీ నిర్వహించగా, పటాకులు పేల్చుతూ, పూలు చల్లుతూ మంత్రి స్వాగతం పలికారు. అనంతరం రైతువేదికలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు ఒక్క పంట పండించడమే గగనమయ్యేదని, నీళ్ల కోసం చెరువులు, కుంటలు, కాల్వల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. ఏటా మూడు పంటలు పండేలా నీటివనరులు అందుబాటులోకి వచ్చాయన్నారు. తెలంగాణ నేడు దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్రంలో సామర్థ్యానికి మించి ధాన్యం పండిస్తుంటే కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. రైతుబంధు పథకం కింద ఈ ఏడాది జిల్లాలోని రైతుల బ్యాంకుఖాతాల్లో రూ.202కోట్లు జమయ్యాయని, విమర్శించడమే పనిగా పెట్టుకున్న బీజేపీ నాయకులకు ఇది కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఏదిపడితే అది అడ్డగోలుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. కేసీఆర్ గొంతులో ప్రాణమున్నంత వరకు రైతుబంధు పథకం ఆగదన్నారు.
కాకతీయుల స్ఫూర్తితో..ఎమ్మెల్సీ రవీందర్రావు
నాడు కాకతీయ రాజులు చెరువులు నిర్మించి రైతులకు సాగు, తాగు నీరు అందించారని, వారి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా తెలంగాణలోని చెరువులను మరమ్మతు చేయించి, పంటలకు సరిపడా నీళ్లు అందిస్తున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. రైతుకు కష్టం వస్తే తనకు వచ్చినట్లుగా భావించి, ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందిపెడుతున్న కేంద్రప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారని అన్నారు. కాలానుగుణంగా వ్యవసాయంలో వచ్చే మార్పులను రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకే రైతు వేదికలను నిర్మించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ..రైతుబంధు పథకంతో సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలిచారని అన్నారు. ‘బీజేపీ బిడ్డల్లారా.. ఇది మీ అడ్డా కాదు.. తెలంగాణ అడ్డా’.. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తే ఇక్కడి ప్రజలు అంత అమాయకులు కాదని, తరిమికొడుతారని హెచ్చరించారు. అనంతరం మహబూబాబాద్ నియోజకవర్గస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ‘తెలంగాణ రాకముందు.., వచ్చాక వ్యవసాయం, రైతుబంధు పథకం’పై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కే శశాంక, జడ్పీ చైర్పర్సన్ బిందు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి ఛత్రూనాయక్, ఏడీఏ లక్ష్మీనారాయణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మహబూబ్‌పాషా, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, ఏవో తిరుపతిరెడ్డి, ఏఈవోలు, ఏఎంసీ వైస్ చైర్మన్ మురళి పాల్గొన్నారు.