జయశంకర్ జిల్లాలో స్వల్పంగా పురుష ఓటర్లు ఎక్కువ
కొత్త జాబితా విడుదల
మొత్తంగా వరంగల్, హనుమకొండలో పెరుగుదల
మిగిలిన నాలుగు జిల్లాలో తగ్గుదల
పరిశీలకుల పర్యవేక్షణలో ప్రకటించిన కలెక్టర్లు
ములుగు, జనవరి 5 (నమస్తే తెలంగాణ)/ భూపాలపల్లి రూరల్;జిల్లావారీగా తాజా ఓటర్ల జాబితా బుధవారం విడుదలైంది. జయశంకర్ జిల్లా మినహా ఐదు జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండగా, గతేడాదితో పోలిస్తే మొత్తంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో సంఖ్య తగ్గింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా జిల్లాల కలెక్టర్లు, పరిశీలకులు ప్రత్యేకంగా సమావేశమై తుది జాబితాను వెల్లడించడంతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్లు, జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రకటించారు.
జిల్లావారీగా తాజా ఓటర్ల జాబితాను అధికారులు బుధవారం విడుదల చేశారు. గతేడాది జనవరి జాబితాతో పోలిస్తే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తగ్గింది. ఆయా జిల్లాల్లోని మొత్తం ఓటర్లు, వీరిలో పురుషులు, మహిళా ఓటర్ల వివరాలు వెల్లడి కాగా జయశంకర్ మినహా మిగతా ఐదు జిల్లాల్లో పురుష ఓటర్ల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. ఎన్నికల జాబితా ప్రక్రియను సజావుగా నిర్వహించిన అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా జిల్లాల కలెక్టర్లు, పరిశీలకులు ప్రత్యేకంగా బుధవారం సమావేశమై తుది జాబితాను విడుదల చేశారు. దీంతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్లు, జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రకటించారు. హనుమకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ, పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలు, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, డోర్నకల్, జనగామలో పాలకుర్తి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, ములుగు జిల్లాలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఈ మేరకు ఓటర్ల జాబితా సిద్ధమైంది.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లాలో 4,78,403మంది ఓటర్లున్నారు. వీరిలో 2,36,815 మంది పురుషులు, 2,41,360మంది స్త్రీలు, 15మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఎన్ఆర్ఐలు 81, రక్షణ ఉద్యోగులు 209మంది ఉన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2,71,865 మంది, పరకాల నియోజకవర్గంలో 2,06,538 మంది ఓటర్లున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం లక్ష్యంగా ఈ జాబితాను సిద్ధం చేశారు. పరకాల సెగ్మెంట్లో 1788, వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లో 1618 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు.