బీజేపీ నాయకులది అరాచకం
మత విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదు
కేసీఆర్‌పై అర్థంలేని ఆరోపణలు చేస్తే ఊరుకోం
కాళేశ్వరానికి కేంద్రం నయా పైసా ఇవ్వలే
రైతుల బాగుకోసం రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు కట్టించి నీళ్లందిస్తున్నది
ఓర్వలేకనే కాషాయ నేతలు తప్పడు ఆరోపణలు చేస్తున్నారు
ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ధ్వజం
మహబూబాబాద్, జనవరి5 (నమస్తే తెలంగాణ) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్దాల కోరు.. కుఠిలనీతితో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఏడేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రం లో జరుగలేదన్నారు. అయినా బీజేపీ నాయకులు ఇక్కడ ఎందుకు అరాచకానికి పాల్పడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో బండి సంజయ్ దీక్ష చేస్తున్న కార్యాలయం తలుపులు పగులగొట్టారని, గ్యాస్ కట్టర్లు ఉపయోగించారని బీజేపీ నాయకులు ఆరోపించడంలో వాస్తవం లేదన్నా రు. తలుపులు వేసుకొని దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బండిది దొంగ దీక్ష అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఈనెల ఒకటి నుంచి 10 వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉన్న విషయం తెలిసి కూడా దీక్ష పేరుతో జనాన్ని గమిగూడేలా చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే, వాటిని గౌరవించకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగడమంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టినా బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రెచ్చగొట్టాలని చూస్తే, రైతులే తరిమి కొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రప్రభుత్వం ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం ఖాళీ చేయించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతుందన్నారు. కాళేశ్వరంలో నీళ్లు పారడం లేదని, అవినీతి పారిందని ఆరోపించడం సరికాదని, నిరూపించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే కట్టించి రైతులకు నీళ్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. ఇంటింటికీ తాగునీరందిస్తున్న మిషన్ భగీరథ పథకంపై నడ్డా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిన బీజేపీ, మత విద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిందని, ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నాని తెలిపారు. కేసీఆర్‌ను బద్నాం చేయడం కోసమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ర్టానికి వచ్చారని, ఒకవైపు మతం ముసుగు వేసుకొని, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల బ్యాక్‌గ్రౌండ్‌తో ఎలాంటి చర్యలు చేపడుతుందో ప్రజలు గమనించాలని కోరారు. ఈ సమావేశంలో మంగళంపల్లి కన్న, రామకృష్ణ, యాకన్న, మడత వెంకన్న పాల్గొన్నారు.
నడ్డాకు సిగ్గుండాలె.. : ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సిగ్గుండాలే. తెలంగాణ గురించి అడ్డంగా మాట్లాడుతున్నడు. ప్రజాస్వామ్యం గురించి బాగా మాట్లాడుతున్నడు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఎంత ప్రజాస్వామ్యం ఉందో ఎవరిని అడిగినా చెప్తరు. ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నడు? కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అంటున్నడు. అవును తెలంగాణ రైతులకు కేసీఆర్ ఏటీఎం లాంటివాడే. కేసీఆర్ గురించి, కాళేశ్వర ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ వాళ్లకు లేదు. తెలంగాణకు వచ్చి సమస్యలపై రంధ్రాన్వేషణ చేస్తున్నరు. విభజనచట్టంలో పొందుపర్చిన ఒక్క హామీనైనా నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖర్చు పెట్టి కట్టుకున్న ప్రాజెక్ట్‌ను చూస్తూ ఓర్వలేక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయం.