కరువుతీరా జలధార
62 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ కళకళ
ఎస్సారెస్పీ రెండో దశ 4.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు సరఫరా
నిండుకుండల్లా 772 చెరువులు, కుంటలు
యాసంగికి పుష్కలంగా సాగునీరు
పడావుబడ్డ భూముల్లో సాగు సందడి
2018 నుంచి రెండు పంటలకు అందుతున్న నీరు
తొర్రూరు, జనవరి 5 ;‘కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎకరాకు కూడా నీరు పారలేదు’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన అడ్డదిడ్డ వ్యాఖ్యలపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతే వరంగల్ జిల్లా నుంచి మొదలుకొని సూర్యాపేట జిల్లా వరకు ఎస్సారెస్పీ రెండో దశలో ఉన్న 4లక్షల 58వేల ఎకరాల్లో రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుంటే జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత నడ్డా చేసిన విమర్శలు చూసి ఆయనకు మతితప్పిందా అని మండిపడుతున్నారు. నాడు పడావు పడి ఉండి.. నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్న భూములు కనిపించడం లేదా? ప్రతిపక్షాలు కళ్లున్న కబోదులా? అని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం వర్షాలపై ఆధారపడ్డ కరువు జిల్లాల రైతులు నేడు ఎక్కడా ఖాళీ లేని సాగు భూములు, అన్ని సీజన్లలో నిండుకుండల్లా కనిపిస్తున్న చెరువులను చూసి మురిసిపోతున్నారు.
2018 నుంచి పుష్కలంగా సరఫరా
2018 నుంచి ప్రస్తుత యాసంగి వరకు ఏటా 28టీఎంసీల గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ రెండో దశ చివరి ఆయకట్టు వరకు వానకాలం, యాసంగి పంటలకు సరఫరా చేస్తున్నారు. 12 డీబీఎంల పరిధిలో 3లక్షల 97వేల 949 ఎకరాల ఆయకట్టుకు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న 772 చెరువుల కింద 60వేల 22ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో రోజుకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం దాకా నీటి సరఫరాను కొనసాగించనున్నారు.
62 కిలోమీటర్ల మేర పరవళ్లు
ఎస్సారెస్పీ రెండో దశ వర్ధన్నపేట మండలంలోని కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్ నుంచి 346వ కిలోమీటర్ వరకు 62 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఐదు జిల్లాల పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లోని 25 మండలాలకు చెందిన 772 చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వరంగల్ జిల్లాలోని రాయపర్తి (పాలకుర్తి నియోజకవర్గ పరిధి) మండలం మైలారం వద్ద 296వ కిలోమీటర్ వద్ద కాకతీయ కాల్వపై 0.867 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ ద్వారా సాగునీరు సరఫరా అవుతున్నది. ఇక జనగామ జిల్లా కొడకండ్ల మండలం (పాలకుర్తి నియోజకవర్గ పరిధి) బయ్యన్నవాగు వద్ద 0.50 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ ద్వారా సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం వరకు గోదావరి జలాలు సరఫరా అవుతున్నాయి. రెండో దశ పరిధిలో డీబీఎం-54 నుంచి 71 వరకు 62 కిలోమీటర్ల నిడివితో ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తికాగా ఇందులో డీబీఎం-60, 71 కాల్వల ద్వారానే రెండున్నర లక్షల ఎకరాలకు పైగా సాగునీరు సరఫరా అవుతున్నది. వానకాలం, యాసంగి సందర్భంలో సుమారు నాలుగు నెలలకు పైగా నీటి సరఫరా కొనసాగుతుంది. ప్రస్తుత యాసంగిలో 15 టీఎంసీల మేర నీటిని సరఫరా చేయనున్నారు.