ముగ్గులేసి, ట్రాక్టర్లతో ర్యాలీ తీసిన రైతులు, ప్రజాప్రతినిధులు
ఎనుమాముల మార్కెట్లో అంబరాన్నంటిన వేడుకలు
పల్లెలు, పంట పొలాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు
అన్నదాతల్లో వెల్లువెత్తుతున్న అభిమానం
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, జనవరి 5 (నమస్తే తెలంగాణ);కరువుతీరా నీళ్లిచ్చి, ఉచిత కరంటిచ్చి, పెట్టుబడికి పైకమిస్తూ, బీమాతో ధీమానిస్తూ అన్నితీర్లా ఆసరా అవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై రైతన్నల అభిమానం ఆకాశాన్నంటుతున్నది. తమ కోసం దేశంలో ఎక్కడాలేని పథకాలు పెట్టి ఎవుసాన్ని పండుగ చేశాడంటూ నిండుమనస్సుతో కృతజ్ఞతను చాటుతోంది. ఈ సందర్భంగా బండెనక బండి కట్టి.. తీరొక్క పూలు, పంట ఉత్పత్తులతో ముగ్గులేసి.. నారుతో పేర్లు రాసి.. పాలాభిషేకాలు చేసి రైతుబాంధవుడు కేసీఆర్కు జైకొడుతున్నది. రైతుబంధు వారోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు హోరెత్తాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి, పల్లి, మిర్చి, మక్కలు, కందులు, పెసర్లు, ఇతర ధాన్యాలతో ముగ్గులు వేసి.. మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబురాల్లో మునిగితేలారు. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ తీశారు.
రైతుబంధు సంబురాలు ఉమ్మడి జిల్లాలో వేడుకలా జరిగాయి. వారోత్సవాల్లో మూడో రోజైన బుధవారం అన్ని జిల్లాల్లో ఉత్సవాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రైతులు తీరొక్క పంట ఉత్పత్తులతో ముగ్గులు వేసి ‘జై కేసీఆర్’, ‘జై రైతుబంధు’ అని జేజేలు పలికారు. ఆ తర్వాత రంగులు చల్లుకొని మహిళా రైతులు మురిసిపోయారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలోని రైతు వేదిక వద్ద మహిళా రైతులు, టీఆర్ఎస్ నాయకులు కోలాటాలు వేస్తూ నృత్యం చేసి సంబురాలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో సంబురాలకు కర్షకలోకం కదిలివచ్చింది. గ్రామం నుంచి రేగొండ వరకు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థులు ‘రైతుబంధు’తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలపై ఉత్సాహంగా ముగ్గులు వేయగా, విజేతలకు బహుమతులు అందజేశారు. హనుమకొండ జిల్లా పరకాల రైతు వేదిక భవనం వద్ద జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రైతుబంధుతోటి30 గొర్లు కొన్న..
నా పేరున నాలుగెకరాలు, మా అమ్మ ఉపేంద్ర పేరున నాలుగెకరాల భూమి ఉన్నది. రైతుబంధు పథకం కింద మాకు ప్రతి యేడు రూ.80వేలు వస్తాంది. నాలుగు సార్లు వచ్చిన డబ్బులతోటి మొదాలు అప్పులు కట్టుకున్న. ఆ తర్వాత వచ్చిన వాటితోటి ఒక యేడు 15, తర్వాత 15 మొత్తం 30 గొర్లు కొన్న. మొన్న పడ్డ పైసలతోటి మళ్ల గొర్లకు కొనడానికి బేరం జేత్తాన. కేసీఆర్ సర్కారు మాకు మూడేళ్ల కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇచ్చింది. సబ్సిడీ గొర్లు, రైతుబంధుతో కొన్నయ్ మొత్తం కలిపి 51 అయినయ్. వీటిలో ఏడాదికి 35 గొర్రె పిల్లలు పడుతున్నాయి. ఏటా 25నుంచి 30వరకు పొట్టేళ్లు అమ్ముకుంటాన. గిట్ల రెండు నుంచి రెండున్నర లక్షల దాకా ఆమ్దాన్ ఉంటాంది. అప్పులబాధల అసలే లేవ్. మా అమ్మ, నా భార్య ఎవుసం పనులు చూసుకుంటరు. నేను రోజు గొర్ల కాసుకుంట. అప్పుడప్పుడు పంటకు మందులు వేయడానికి, పురుగుమందులు కొటడానికి నేను పోత. గొర్రెలకు నట్టల మందు కూడ గీ సర్కారే ఇత్త్తాంది. ఇదివరకు కరంటు సక్కగ లేక పంటలు పండకపోయేది. కేసీఆర్ సారు అచ్చి, రైతుబంధు తెచ్చినంక మా బాధలన్నీ తీరినయ్. ఇంటి మనిషి లెక్క అన్నిటికి ఆసరైతాండు. ఫ్రీ కరెంటు ఇచ్చిండు. రైతుబంధు పెట్టి రైతుల బాధలు తీరుత్తాండు. మాలాంటోళ్లకు ఆయన ఎంతో మేలు జేత్తాండు. ఇసొంటి ముఖ్యమంత్రి మా రైతులకు కష్టాలనేటియే ఉండయ్.