సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి
భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు : కలెక్టర్ కృష్ణ ఆదిత్య
తాడ్వాయి, జనవరి 4 : మహాజాతర సమీపిస్తున్నందున అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, డీఆర్వో రమాదేవితో కలిసి కలెక్టర్ మేడారం పరిసరాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని సందర్శించి మంచె పైనుంచి పరిసరాలను చూశారు. దర్శనానికి భక్తులకు పంపించే పద్దతులను ఎస్పీని అడిగితెలుసుకున్నారు. గద్దెలపై పోగయ్యే బెల్లం తరలించే మార్గాన్ని తెలుసుకుని, ఈసారి బెల్లం సారలమ్మ ఔట్‌గేట్ నుంచి తరలించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర సందర్భంగా అమ్మవార్ల పూజారులు విశ్రాంతి తీసుకునేందుకు వెంటనే 10 కాటేజ్‌లను నిర్మించాలని ఐటీడీఏ ఈఈ హేమలతను ఆదేశించారు. అనంతరం అధికారులు బస చేసేందుకు కేటాయించిన కాటేజ్‌లు, ఆర్డబ్ల్యూఎస్ గెస్ట్‌హౌస్‌లను పరిశీలించారు. అక్కడ సౌకర్యాలపై ఆరా తీశారు. నూతనంగా నిర్మిస్తున్న పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించి సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించేందుకు అదనంగా స్థలం కావాలని పోలీసు అధికారులు కలెక్టర్ దృ ష్టికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించా రు. జోన్ల వారీగా జరిగిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు.
ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తయ్యాయి? తాగునీరు అందించేందుకు బీవోటీలు ఏర్పా టు చేశారా? ఎన్ని చేశారు? నీటి సరఫరా అవుతుందా? ఇబ్బందులు ఏమై నా తలెత్తే అవకాశాలు ఉన్నాయా అని కలెక్టర్ తెలుసుకున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగొద్దని, లైటింగ్, నీటి సరఫరాలో సమస్యలు తలెత్తవద్దన్నారు. ఇందుకోసం ముదంస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కావాల్సిన పనులను చేసేందుకు వివిధ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మహాజాతర ముం చుకొస్తున్నదని, పనులు సకాలంలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి సెక్టోరియల్ అధికారి వద్ద వారికి కేటాయించిన జోన్లలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. రోజువారి పనుల వివరాలతో పాటు అయిన పనుల ఫొటోలు తనకు పంపించాలని కలెక్టర్ సూచించారు. మూడు రోజుల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహిస్తామని, అప్పటి వరకు అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించాలన్నారు.
మ్యాప్ ద్వారా రూట్లపై వివరణ
మేడారంకు వచ్చే భక్తుల కోసం తయారు చేసిన రూట్ మ్యాప్‌ను కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీపాటిల్ వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఆదిలాబాద్, కరీంగనర్, గోదావరిఖని తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను కాటారం, కాల్వపల్లి మీదుగా మేడారానికి తరలిస్తామని, తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల మీదుగా హన్మకొండ తదితర ప్రాంతాలకు వాహనాలు వెళ్లేలా రూ ట్ మ్యాప్‌లు సిద్ధం చేసిట్లు చెప్పారు. ఎక్కడా ట్రాఫిక్‌జామ్ సమస్యలు రా కుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. వాహనాలు బ్రేక్‌డౌన్ అయితే వెంటనే రూట్ క్లియర్ చేసేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌కు వివరించారు.