జిల్లా కేంద్రంలో ఎన్‌హెచ్-353సీ పైనే పార్కింగ్
ఇరువైపులా షాపుల ముందే లారీల నిలిపివేత
చాలాసేపు సరుకుల అన్లోడ్
ట్రాఫిక్ రూల్స్‌పై కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
వ్యాపారులు, వాహనదారుల ఇష్టారాజ్యం
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 3 (నమస్తే తెలంగాణ) :భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ట్రాఫిక్‌పై నియంత్రణ లేకుండా పోయింది. మెయిన్ రోడ్డుపై వాహనాలు నిలుపొద్దనే కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. జిల్లా కేంద్రం మీదుగా వెళ్లే 353సీ జాతీయ రహదారి నిత్యం బొగ్గు, ఇసుక లారీలు, కాళేశ్వర పుణ్యక్షేత్రం, ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే వారితో రద్దీగా ఉంటుంది. ఇదే సమయంలో భారీ వాహనాలను ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ప్రజలు, ద్విచక్ర వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరోవైపు జాతీయ రహదారిపై ఇరువైపులా షాపుల ఎదుట లారీలు నిలిపి సరుకులను చాలాసేపు అన్లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తరచూ ట్రాఫిక్ జామ్ అయి బాంబులగడ్డ నుంచి మంజూర్‌నగర్ వరకు పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని రహదారులపై వాహనాలు నిలిపిన వారికి జరిమానాలు విధిస్తున్నా వ్యాపారస్తులు, వాహనదారులు బేఖాతరు చేస్తున్నారు. లారీలకు, ఇతర వాహనాలకు ప్రత్యేకమైన పార్కింగ్ ప్రదేశాలను కేటాయించినా పట్టించుకోవడంలేదు.
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలపడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా కేంద్రం నుంచి 353సీ జాతీయ రహదారి వెళ్తోంది. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి, రవాణా, గోదావరి నది నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణా చేసే వందలాది వాహనాలు, కాళేశ్వరం పుణ్యక్షేత్రం, ప్రాజెక్టు సందర్శనకు వచ్చే భక్తులు, పర్యాటకుల వాహనాలు నిత్యం జిల్లా కేంద్రం నుంచే వెళ్తుంటాయి. వర్తక, వాణిజ్య సముదాయాలు పెరిగాయి. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 60 వేల జనాభా ఉంటుంది. ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చిన వారితో అంతకంటే ఎక్కువే ఉంటారు.
ఇష్టారాజ్యంగా పార్కింగ్
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలేదు. ఎన్‌హెచ్ 353సీపై ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా బాంబులగడ్డ నుంచి మంజూర్‌నగర్ వరకు భారీ వాహనాలు నిలుపుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు, ద్విచక్ర వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై లారీలు, ఇతర భారీ వాహనాలు నిలుపొద్దని మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోవడంలేదు.
సమయపాలన లేకుండా…
జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారికి ఇరువైపుల వర్తక, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఆయా వ్యాపారులు సరుకులను ట్రాన్స్‌ఫోర్ట్ లారీల్లో తెప్పిస్తుంటారు. ఈ క్రమంలో షాపులకు ఎదురుగా, రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి దింపుకుంటున్నారు. ఇలా చాలాసేపు చేయడం వల్ల ప్రధానంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ విషయంలో వ్యాపారులు సమయ పాలన పాటించడంలేదు. జనసంచారం లేని సమయంలో సరుకులను అన్లోడ్ చేసుకోవాలనే ఆలోచన చేయడంలేదు.
పలుచోట్ల తరచూ ప్రమాదాలు
జిల్లా కేంద్రంలో జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న షాపులు, హోటళ్లు, ఇతర దుకాణాల ముందు లారీలు, టాటాఏస్ ట్రాలీలు, ద్విచక్రవాహనాలు నిలిపిస్తున్నారు. దీంతో రోడ్డుపై వాహనదారులు వెళ్లే క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ సెంటర్, జయశంకర్ విగ్రహం, బాంబులగడ్డ, మంజూర్‌నగర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటోంది.
ఆదేశాలు బేఖాతరు
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జామ్ సమస్యపై కలెక్టర్, అదనపు కలెక్టర్ పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు, ఇతర సమావేశాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సూచనలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్డుపై వాహనాలు నిలుపొద్దని ఆదేశించారు. పలుమార్లు జరిమానాలు విధిస్తున్నా కలెక్టర్ ఆదేశాలను వ్యాపారస్తులు, వాహనదారులు బేఖాతరు చేస్తున్నారు. లారీలకు, ఇతర వాహనాలకు ప్రత్యేకమైన పార్కింగ్ ప్రదేశాలను కేటాయించినా పట్టించుకోవడంలేదు.