మంత్రి కేటీఆర్ పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోరు
గ్రామగ్రామాన పటాకులు కాల్చి మిఠాయిలు పంచి వేడుకలు
డప్పు చప్పుళ్లతో రైతులు, నాయకుల ర్యాలీలు
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 3 (నమస్తేతెలంగాణ) : ఈనెల 10నాటికి రైతుల ఖాతాల్లోకి రూ.50వేల కోట్ల పెట్టుబడి సాయం చేరనున్న సందర్భాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశ చరిత్రలోనే వ్యవసాయ రంగంలో నవశకాన్ని సృష్టించిన రైతుబంధు.. అన్నదాతలకు కొండంత అండగా నిలిచింది. రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం కర్షకుల ఆర్థిక పరిపుష్టికి బాటలు వేసింది. ఎవుసానికి ఎంతో ఊతమిచ్చిన ‘రైతుబంధు’ తమ జీవితాల్లో పండుగ తెచ్చిందని రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ మేరకు ఉత్సాహంతో ఉత్సవాల్లో మొదటి రోజున టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొని అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించారు.
రైతుబంధు వారోత్సవాలు సోమవారం ఊరూరా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సంబురాలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో ర్యాలీలు తీశారు. పటాకులు పేల్చి స్థానికులకు మిఠాయిలు పంచారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతుబంధు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 10వరకు ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న ఆర్థిక సహాయం రూ.50 వేల కోట్లకు చేరనుంది. ఒక పథకం ద్వారా రైతులకు ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం రూ.50 వేలకోట్ల పంట పెట్టుబడి సాయం అందించలేదు. దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలోనే జనవరి 3 నుంచి 10వరకు ఊరూరా రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రామారావు టీఆర్ఎస్ శ్రేణులకు ఆదివారం పిలుపు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, డీసీసీబీ, ఓడీసీఎంఎస్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు వారోత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడ కూడా రైతుబంధు తరహా పథకాలతో ప్రభుత్వాలు రైతులను ఆదుకొన్న దాఖలాలు లేవని, ఆ ఘనత తెలంగాణ రాష్ర్టానికే సొంతమని అన్నారు. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించి ప్రతి ఒకరికీ రైతుబంధు ప్రత్యేకత అర్థమయ్యేలా తెలియజేయాలని పేర్కొన్నారు.
ఐదోరోజు ఖాతాల్లో జమ
పెట్టుబడి సాయం రైతన్నలకు సంబురం తెచ్చింది. కొత్త సంవత్సరం వేళ వారి ‘రైతుబంధు’ రావడం వారి ఇంట ఆనందం నింపింది. రెండు రోజుల(శని, ఆది) వరుస సెలవు తర్వాత సోమవారం 5వ రోజు బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. మొదట ఎకరం, ఆ తర్వాత రెండు, మూడెకరాలున్న రైతులకు డబ్బులు ఖాతాల్లో వేసిన కేసీఆర్ సర్కారు.. సోమవారం 4 నుంచి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న వారికి అకౌంట్లో వేసింది. కాగా, ఫోన్‌కు మెసెజ్ వచ్చిన రైతులు బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకొని మురిసిపోతున్నారు. పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతరత్రా కొనుగోలు చేస్తూ ఉత్సాహంలో పనులకు వెళ్తున్నారు. అదునుకు సాయం చేసి రైతులను అన్ని తీర్ల ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు మరువలేమంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
మస్తు అక్కరకొత్తున్నయ్..
దేవరుప్పుల, జనవరి 3: రైతుబంధు పైసలు మస్తుగ అక్కరకొత్తున్నయ్. యాసంగి నాటుకు సరిగ్గ పైసలందినయ్. తెల్లారితె నాటు, మసాల బస్తాలకు సావుకారి దగ్గరకు పోవాలని ఆలోచన చేస్తున్న. ఎంటనె టింగ్‌టింగ్‌మని సెల్లు మోగింది. చూస్తే రైతుబంధు పైసల్ పడ్డట్టు కేసీఆర్ పంపిన మెస్సేజ్ ఉంది. బ్యాంకుకు పోయి పైసలు ఇడిపిచ్చిన. పక్కనే ఉన్న ఎరువుల దుకాండ్ల మసాల తెచ్చిన. నాటు పడ్డది. రైతుబంధు పైసలు మంచిగ ఆసరైతున్నయ్. అక్కడిక్కడికి అయితున్నయ్. పైసల్ పుట్టని రోజులల్ల కేసీఆర్ పుణ్యమా అని పెట్టుబడి ఎల్లుతుంది. రుణపడి ఉంటం.-భూక్యా పన్యా-బుజ్జి దంపతులు, బోడబండ తండా, దేవరుప్పుల
అంబరాన్నంటిన సంబురాలు
కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి కరోనా నిబంధనలకు లోబడి పల్లెల్లో రైతుబంధు వారోత్సవాలను షురూ చేశారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి, హనుమకొండ జిల్లాలోని పరకాల, ఆత్మకూరు, మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, నెల్లికుదురు మండలాల్లోని గ్రామాల్లో డప్పు చప్పుళ్లతో ఊరేగింపు తీసి కూడళ్ల వద్ద పటాకలు కాల్చారు. సీఎం కేసీఆర్ చిత్రపటంతో పాటు ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఇదీ కార్యాచరణ
వ్యవసాయం- ప్రాధాన్యం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత వ్యవసాయరంగ పరిస్థితి, రైతుబంధు సంబంధిత అంశాలపై ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. రైతుబంధు సంబంధిత అంశాలపై ఈ నెల 8, 9 తేదీల్లో గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. 10న రైతు వేదికల వద్ద ఆత్మీయ సమ్మేళనాలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు, డప్పు, డోలు, తప్పెట్లు ఇతర స్థానిక కళారూపాల ప్రదర్శనలకోసం సన్నద్ధమవుతున్నారు.