శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి
బీజేపీ బూటకపు మాటలు నమ్మొద్దు : ఎమ్మెల్యే గండ్ర
చిట్యాలలో సీసీ రోడ్లు ,రైతు వేదిక ప్రారంభం
29మందికి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
చిట్యాల, జనవరి 2 : రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి వెంకట్రావుపల్లిలో రూ.15లక్షలు, మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో రూ.10లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదికను ప్రారంభించి, 29మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి మండల కోర్డినేటర్ నల్ల సమ్మిరెడ్డి, ఎంపీపీ దావు వినోదా వీరారెడ్డి అధ్యక్షతను రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ప్రొటెం చైర్మన్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు చెప్పులు వరుసగా పెట్టి నిరీక్షించే దుస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ నాటి పరిస్థితులను పూర్తిగా మార్చారని తెలిపారు. ఏడాదికి ఎకరానికి రూ.10వేలను రైతుబంధు సాయంగా అందజేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మందుందని, ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు.
బీజేపీవి బూటకపు మాటలు : ఎమ్మెల్యే గండ్ర
బీజేపీ నేతల బూటకపు మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉండగా చేతులెత్తేయడం సిగ్గుచేటన్నారు. వానకాలంలో పండించిన వడ్లను కొనుగోలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పకుండా కొనుగోలు చేసిందన్నారు. పథకాలతో రాష్ర్టాన్ని ముందుంచుతున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా ఉండాలని కోరారు. జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఏవో నాలికె రఘుపతి, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోర్డినేటర్ నల్ల సమ్మిరెడ్డి, స్థానిక సర్పంచ్ పూర్ణ చందర్రావు, ఎంపీటీసీలు కట్కూరి పద్మా నరేందర్, దబ్బెట అనిల్, కోఆప్షన్ మెంబర్ ఎండీ రాజమహ్మద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కామిడీ రత్నాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు జంబుల తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధానకార్యదర్శులు మడికొండ రవీందర్రావు, ఏరుకొండ రాజేందర్, మన్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.