కృష్ణకాలనీ, జనవరి 2: సింగరేణి సెక్యూరిటీ, పోలీసు ఉద్యోగంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఉపయోగపడే శారీరక ఈవెంట్స్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కందునూరి రాజేశం సేవలు మరువలేనివని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు అన్నారు. సింగరేణి సెక్యూరిటీ సమీదార్ కందునూరి రాజేశం స్మారకార్థంగా రాజేశం స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ కందునూరి కుందన్ కిశోర్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లాలో రోజుకొక క్రీడాకారుడిని తయారు చేసే ప్రతిభ కలిగిన రాజేశం మృతి క్రీడా రంగానికి తీరని లోటన్నారు. రాజేశం తనకున్న ప్రతిభతో ఇండియన్ ఆర్మీలో పని చేస్తూ దేశ సేవ చేసిన మహనీయుడన్నారు. భూపాలపల్లిలో సింగరేణిలో సక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎంతోమంది యువతీ, యువకులకు ఆర్మీ సెలక్షన్ శిక్షణ ఇచ్చారని కొనియాడారు. జిల్లా నుంచి ఎంతోమందిని సైనికులుగా తీర్చిదిద్దారని అన్నారు. పోలీసు ఉద్యోగం వైపు ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు సైతం శారీరక దృఢత్వమైన ట్రైనింగ్ ఇచ్చి పోలీసు ఉద్యోగాలు పొందేందుకు కృషి చేశారని అన్నారు. ప్రతి క్రీడాకారుడూ రాజేశం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తన ప్రతిభను ఇతరులకు ఉపయోగపడేలా కృషి చేయాలన్నారు. రాజేశం పేరున స్పోర్ట్స్ క్లబ్‌ను ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, సింగరేణి స్పోర్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఎస్ఎస్వో ఎమ్డీ షరీఫ్, రాజేశం కుటుంబ సభ్యులు కమల్ కిషోర్, పద్మ, రమ్య, భవాని, శ్రీక కిషోర్, సీనియర్ క్రీడాకారులు కే సంజీవరావు, ఇంద్రాసేనారెడ్డి, కరాటే శ్రీనివాస్, దేవన్, దశరథంరెడ్డి, ఉపేందర్, అంజీ, మురళి తదితరులు పాల్గొన్నారు.