పీల్చి పిప్పి చేస్తున్న పురుగులు
రాలిపోతున్న పిందెలు
భారీగా పడిపోయిన దిగుబడి
లబోదిబో మంటున్న రైతులు
ఏటూరునాగారం/మంగపేట, జనవరి 2: లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎన్నో ఆశలతో మిర్చి సాగు చేస్తున్న రైతులకు నల్ల తామర పురుగు(ఎర్రనల్లి)తో కష్టాలు ఎక్కువయ్యాయి. అత్యంత సూక్ష్మంగా ఉండే ఈ పురుగులు మిరప పూలను కేంద్రంగా చేసుకుని చెట్టు ఎదగకుండా చేస్తుంది. మొగ్గ రాకుండా అడ్డుకుంటుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తామర పురుగు సోకిందంటూ మిర్చి రైతులు లబోదిబో మంటున్నారు. మిర్చి రైతు కంట్లో పురుగు కన్నీటిని తెప్పిస్తున్నది. మండలంలోని అనేక గ్రామాల్లో ఏటా మిర్చి సాగు చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొద్ది రోజులుగా తోటలకు తామర సోకుతోంది. ముందుగానే పూవుపై ప్రవేశించే పురుగులు క్రమంగా రసం పీల్చి పూత ఎండిపోయేలా చేస్తున్నది. పూలు పిందెలుగా మారడం లేదు. మిరప చెట్లు కొమ్మలు వాడి పోతున్నాయి. ఆకులు ముడత పడుతున్నాయి. దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడికి తీసుకువచ్చిన అప్పులు తీర్చేదెలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. మిర్చి తోటలకు ఆయా పురుగును బట్టి వారం, పది రోజులకోసారి పురుగు మందు పిచికారీ చేస్తుంటారు. కానీ తామర పురుగు సోకినప్పటి నుంచి మూడు రోజులకు ఒకసారి పురుగు మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదని రైతులు అంటున్నారు. పంట తొలి కోత పూర్తి చేసి రెండో కోతకు సిద్ధం కావాల్సిన రైతులు మొదటికే మోక్షం లేదంటూ వాపోతున్నారు. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు రావల్సిన దిగుబడి ఈసారి ఐదు క్వింటాళ్లు కూడా వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.
వేరుకుళ్లుతో ఎండిపోతున్న మిర్చి పంట
తామర పురుగుకు తోడు పంటకు వేరుకుళ్లు తెలుగు సోకుతోంది. దీంతో మిరప కాయలు పండ్లుగా మారే సమయంలో మొక్కలు ఎండిపోతోంది. వేరు కుళ్లు సోకడంతో మొక్కలు వాడిపోతున్నాయి.
ఇలా కాపాడుకోవాలి..
మంగపేట మండలంలోని కమలాపురం, మంగపేట, తిమ్మంపేట, చెరుపల్లి, మల్లూరు, పాలాయిగూడెం, వాడగూడెం, రమణక్కపేట, రాజుపేట, కత్తిగూడెం, దేవనగరం తదితర గ్రామాలకు చెందిన రైతులు గోదావరి తీరం వెంట ఉన్న నల్లరేగడి భూముల్లో విసృతంగా మిర్చి పంట సాగు చేశారు. హర్టికల్చర్ అధికారిక లెక్క ప్రకారం మండలంలో 1800 ఎకరాల్లో మిర్చి సాగు అవుతున్నా, అనధికారికంగా ఈసంఖ్య ఎక్కువగానే ఉంది. నారుమడి పెంపకం మొదలు కొని మిర్చి తోటలు కోత దశకు వచ్చేంతవరకు రైతాంగం లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. నాటిన తొలినాళ్లలో వైరస్, వేరుకుళ్లు, ఆకు ముడత, పూత, కాత దశలో తామర పురుగు వ్యాపించడంలో రైతులు ఆందోళనలో పడ్డారు. నల్లతామర పురుగు ఉధృతి ఎక్కువ కావడంతో రైతులు హర్టికల్చర్, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పసుపు, నీలిరంగు జిగురు అట్టలను తోటల్లో ఏర్పాటు చేస్తున్నారు. పురుగులు ఈఅట్టలకు అతుక్కుంటున్నాయి. వీటితోపాటు వేపనూనె, రసాయన మందులు కూడా వాడుతున్నారు. తోటల్లో అక్కడక్కడా ప్రొద్దు తిరుగుడు మొక్కలను ఆకర్షణ పంటగా వేసుకుంటే పురుగులను నివారించవచ్చునని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. రైతులు ఎకరాకు సుమారు రూ.లక్షా యాబై వేల వరకు పెట్టుబడులు పెట్టారు. బాగా పండితే 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ ఈసారి దిగుబడి చాలా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు.