సకల హంగులతో రోడ్ల విస్తరణ
92 సర్వే నంబర్లలో 345 ఎకరాలు
రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి భూములు
భూ వినియోగాల మార్పుకు కౌన్సిల్ ఆమోదముద్ర
ఉపగ్రహ చిత్రాల ద్వారా రూపకల్పనకు సన్నాహాలు
ప్రతిపాదనలకు తుది మెరుగులు
జనగామ, జనవరి 1(నమస్తే తెలంగాణ) : జనగామకు కొత్త మాస్టర్‌ప్లాన్ సిద్ధంకానున్నది. ఈమేరకు డీటీసీపీ(డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) యోచిస్తుండగా, ఇక పట్టణం మరింత అభివృద్ధి చెందనున్నది. ఇందుకుగాను పట్టణంలోని 92 సర్వే నంబర్లలోని 345 ఎకరాల భూమిని రెసిడెన్సియల్ జోన్లోకి మార్చేందుకు ఇటీవలి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా 50ఫీట్లతో రోడ్డు, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు రానున్నది. అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లాకేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుచేయనున్న క్రమంలో జనగామ పట్టణాభివృద్ధి సంస్థ(జుడా) ఏర్పాటైతే ప్రగతి మరింత జోరందుకోనున్నది.
జనగామ పట్టణ కొత్త మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేయాలని డీటీసీపీ యోచిస్తున్నది. మున్సిపల్ పరిధిలోని గృహాలు, పరిశ్రమలు, రోడ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు వంటి భూ వినియోగ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ తయారీకి ఈ పద్ధతి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు ఉన్నాయో ఉపగ్రహ చిత్రాల ద్వారా మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. ఇరుగ్గా ఉన్న రోడ్లను భవిష్యత్ అవసరాల రీత్యా వెడల్పు చేసే విధంగానే కొత్త మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయనున్నారు. 1990 ఆగస్టు 7న అంటే దాదాపు 30 ఏళ్ల క్రితం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో పట్టణంలోని గ్రీన్‌సిటీ ఇండస్ట్రియల్ ఏరియాగా ఉంది. పట్టణీకరణ నేపథ్యంలో ప్రస్తుతం గ్రీన్‌సిటీ మొత్తం గృహ నిర్మాణాలుగా మారాయి. మాస్టర్‌ప్లాన్ వాస్తవ భూ వినియోగం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇండస్ట్రియల్ ఏరియాగా మాస్టర్‌ప్లాన్‌లో ఉండడంతో ఇళ్ల నిర్మాణాల అనుమతుల జారీకి మున్సిపాలిటీలో అవకాశం లేకుండా పోయి ఆదాయం రావడం లేదు. ఈమేరకు ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పట్టణంలోని మొత్తం 92 సర్వేనంబర్లలో సమారు 345 ఎకరాలు పబ్లిక్ అండ్ సెమీపబ్లిక్, ఇండస్ట్రిడియల్ యూజ్ జోన్లుగా ఉన్న వీటిని రెసిడెన్షియల్ జోన్‌గా మార్చేందుకు కౌన్సిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటి సవరణతో కొత్తగా వెలసిన కాలనీలు మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి రానున్నాయి. చాలావరకు వ్యవసాయ భూములు ఇప్పుడు ఇళ్ల స్థలాలుగా మారాయి. పట్టాదారులు రోడ్లు తీసి అమ్ముకోవడంతో అందులో వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు.
అయినప్పటికీ పాత మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తుతం కాలనీలుగా మారిన ఇళ్ల మధ్య నుంచే 50 ఫీట్ల రోడ్ల ప్రతిపాదన ఉండగా, కొద్ది నెలల క్రితం ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ తయారు చేసిన కొత్త మాస్టర్‌ప్లాన్‌లో ఇప్పటికే 40ఫీట్లుగా ఉన్న రోడ్లను 50ఫీట్ల కొత్త మాస్టర్ ప్లాన్ పరిధిలోకి చేరుస్తూ ప్రతిపాదించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకేంద్రాల్లో పట్టణాభివృద్ధి సంస్థలు(డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాలిస్తే సిద్ధంగా ఉండేందుకు అనుగుణంగా కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తుండగా ఇది అమలైతే జనగామకు కొత్తరూపు వస్తుంది. పట్టణాల్లో మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కల్పనతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. జిల్లాకేంద్రాల్లో ట్రాఫిక్ కష్టాలను దూరం చేసే లక్ష్యంతో పాటు పట్టణం చుట్టూ విస్తరించే దిశగా ఉండేందుకు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, జనగామ పట్టణాభివృద్ధి సంస్థ(జుడా) ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో పెద్ద పట్టణంగా సెకండ్ గ్రేడ్ పురపాలక సంఘంగా ఉన్న జనగామ 17.2చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 12 వేల కుటుంబాలు, ప్రస్తుతం జనాభా 52,409కు చేరింది. దీనికితోడు జిల్లాకేంద్రాన్ని ఆనుకొని ఉన్న శామీర్‌పేట, వడ్లకొండ, నెల్లుట్ల, పెంబర్తి, యశ్వంతాపూర్, చీటకోడూరు, ఎల్లంల, చిక్కులోనిగూడెం వరకు కొత్తగా ఇళ్ల నిర్మాణం, కాలనీలు, విల్లాలు, ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభాకు తోడు జిల్లా ప్రకటన తర్వాత అధికారులు, అనధికారులు, వ్యాపారుల కుటుంబాలు అదనంగా పెరిగిన మరో 10 శాతం జనాభా, నిత్యం 20వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 163వ జాతీయ రహదారిని యాదగిరిగుట్ట-వరంగల్ వరకు ఫోర్‌లేన్‌గా విస్తరించింది. ప్రస్తుతం పెంబర్తి నుంచి యశ్వంతాపూర్ వరకు ఉన్న హైవే బైపాస్కు అనుసంధానంగా పెంబర్తి నుంచి శామీర్‌పేట, యశ్వంతపూర్ వరకు మరో బైపాస్ నిర్మిస్తే పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు ఏర్పడి జిల్లాకేంద్రం ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ఈమేరకు రెండో బైపాస్కు సంబంధించిన ప్రభుత్వం ఆమోదముద్ర కూడా వేయడంతో త్వరలో భూసేకరణ ప్రక్రియ మొదలుకానున్నది. జనగామ జిల్లాగా మారిన నేపథ్యంలో భవిష్యత్‌లో విద్య, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడం, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో హైదరాబాద్-వరంగల్ ఇండ్రస్టియల్ కారిడార్ ఉండడంతో భవిష్యత్‌లో పట్టణానికి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పెరిగే జనాభా అవసరాలకు తగ్గట్టు రింగ్‌రోడ్డు(డీపీఆర్) రూపకల్పనకు తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే కార్యారూపం దాల్చనుంది.