మధ్యాహ్న భోజన బియ్యానికి ఈ-పాస్ విధానం
ప్రత్యేక సంచుల్లో సన్న బియ్యం పంపిణీ
జిల్లాలో 25,453 మంది విద్యార్థులకు లబ్ధి
విద్యార్థులు, వంట ఏజెన్సీల వివరాలు ఆన్లైన్లో నమోదు
త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు
ప్రభుత్వ పాఠశాలలకు పారదర్శకంగా సరఫరా
పర్యవేక్షణకు త్వరలో మండల స్థాయి కమిటీలు
భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 31;ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీలో అవకతవకలకు చోటు లేకుండా రాష్ట్ర సర్కారు ‘ఈ-పాస్’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొన్ని స్కూళ్లకు దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు రావడంతో దీనిని అరికట్టేందుకు పక్కాగా చర్యలు చేపట్టింది. జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 430 సర్కారు స్కూళ్లు ఉండగా, వీటిలో 22,453 మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా తర్వాత తల్లిదండ్రులు సర్కారు బడి వైపు మొగ్గు చూపడంతో ఈ ఏడాది కొత్తగా 3,200 మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. వారికి ప్రతి నెలా సుమారు 85 టన్నుల సన్న బియ్యం ప్రత్యేక సంచుల్లో ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. దీంతో అవకతవకలు జరుగకుండా విద్యార్థులకు సన్నబియ్యం అందనుంది. త్వరలో బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు కూడా చేస్తున్నది. అంతేకాకుండా భోజన నాణ్యతను పర్యవేక్షించేందుకు జిల్లా, మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలతో కమిటీలు వేయనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సన్న బియ్యం పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కారు పకడ్భందీ చర్యలు తీసుకుంది. తాజాగా ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా జిల్లాలోని ప్రతి పాఠశాల, హాస్టల్కు చెందిన బియ్యం నిల్వలు, వినియోగం వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నా రు. ఇప్పటికే పాఠశాలలు, హాస్టళ్లకు సంబంధించి ప్రత్యే క సంచుల్లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ప్రతి బియ్యపు గింజను లెక్క ప్రకారం చేర్చుతున్నది. మధ్యాహ్న భోజ న పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. కొన్ని పాఠశాలల్లో సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు వస్తుండడంతో దీనిని అరికట్టేందుకు ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వసతి గృహా లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే సంచులపై ప్రభు త్వం సన్నరకం బియ్యం అని ముద్రించి 50 కిలోల ప్రత్యేక సంచుల్లో సరఫరా చేస్తున్నది. దీని ద్వారా మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా విద్యార్థులకు సన్నబియ్యం అందనుంది.
జిల్లాలో 25,453 మంది విద్యార్థులు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 430 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 317, ప్రాథమికోన్నత పాఠశాలలు 44, జిల్లా పరిషత్ పాఠశాలలు 69 ఉన్నా యి. 22,453 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కరోనా తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపుతుండడంతో ఈ ఏడాది 3200 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. సర్కారు బడుల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ప్రతి నెలా ప్రభుత్వం సుమారు 85 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
పారదర్శకంగా మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనంలో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. సన్నబియ్య సరఫరాకు తెల్ల సంచులను ఉపయోగిస్తోంది. విద్యార్థులు, వంట ఏజెన్సీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. త్వరలో బయో మెట్రిక్ విధానం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. భోజన నాణ్యతను పర్యవేక్షించేందుకు జిల్లా, మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలతో కమిటీలు వేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదులను నిర్మించాలని నిర్ణయించారు.