భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 17 : జిల్లాలో రైతులు పంటల మార్పిడిపై దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఆరుతడి పంటలతో లాభాలు గడిస్తున్న రైతులను ఆదర్శంగా తీసుకుంటున్నారు. వరి పంటకు, ఆరుతడి పంటల సాగుతో వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. ఆరుతడి పంటలతో లాభాలు వస్తుండడంతో అందరూ ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామానికి చెందిన యువ రైతు తొడుపునూరి వెంకటేశ్ బీర పంటతో అధిక రాబడి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న నాలుగున్నర ఎకరాల్లోని ఒక ఎకరం భూమిలో ఆరేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా బీర సాగు మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఏడాదికి మూడు పంటలు చేతికొస్తుండగా ఎకరం భూమిలో ఒక పంటతో అన్ని ఖర్చులు పోను సుమారు రూ.90 వేలు సంపాదిస్తున్నాడు. బీరకాయలను హోల్‌సేల్‌గా విక్రయించకుండా సమీపంలోని వారాంతపు సంతలకు తీసుకెళ్లి చిన్న చిన్న వ్యాపారులకు సరఫరా చేస్తున్నాడు.
ఆరేళ్లలో రూ.15 లక్షలపైనే..
గ్రామంలో ఆరేళ్ల క్రితం బీర సాగు చేపట్టిన వెంకటేశ్ అన్ని ఖర్చులు పోను సుమారుగా రూ.15 లక్షలకు పైగానే సంపాదించాడు. తనకున్న నాలుగున్నర ఎకరాల్లో ఎకరం బీర, 20 గుంటలు మామిడి, మిగతా మూడెకరాలు వరి వేశాడు. బీర సాగు లాభదాయకంగా ఉండడంతో ఆరుతడి పంటల విస్తీర్ణం మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం ఎకరం భూమిలో బీర సాగు కోసం రూ.2.30 లక్షలతో పందిరి వేయించాడు. ఇందులో రూ.లక్ష ప్రభుత్వ సబ్సిడీ వచ్చింది. విత్తనాలు, ఎరువులు, కూలీలు రూ.40వేలు, రవాణాకు రూ.20వేలు కలిపి మొత్తం రూ.40 వేలు ఖర్చు వస్తుందని వెంకటేశ్ చెబుతున్నాడు. ఏడాదికి మూడు పంటలు అంటే 90 రోజులకు ఒక పంట. నాటిన 45 రోజులకు పంట ప్రారంభమై మరో 45రోజుల పాటు పంట వస్తూనే ఉంటుంది. ఎకరం భూమిలో ఒక పంటకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తుండగా ఖర్చులు పోను సుమారు రూ.90 వేల నుంచి రూ.లక్ష ఆదాయం వస్తుందని వెంకటేశ్
వివరించారు.
వారాంతపు సంతలకే నేరుగా..
మొదటి సంవత్సరం పంట తీసిన వెంకటేశ్ బీర విక్రయాల్లో మెళకువలు నేర్చుకున్నాడు. హోల్‌సేల్‌గా అమ్మితే లాభాలు పెద్దగా రావని భావించాడు. గ్రామానికి సమీపాల్లో జరిగే వారాంతపు సంతలకు బీరను తీసుకెళ్లి అక్కడ వ్యాపారులకు అమ్ముతాడు. భూపాలపల్లి, గణపురం, పెద్దాపూర్, జంగేడు, కొంపెల్లి, గొర్లవీడు సంతలకు తన వాహనంలో ముందే తూకం వేసి పెట్టెల్లో తీసుకెళ్లి విక్రయిస్తాడు. ఇలా అధిక లాభం వచ్చే అవకాశం ఉంది.
లాభసాటిగా ఉంది
ఎకరం భూమిలో ఆరేళ్ల నుంచి బీర సాగుచేస్తున్న. లాభసాటిగా ఉంది. 90 రోజులకు ఒక పంట వస్తుంది. అన్ని ఖర్చులు పోను రూ.90 వేల నుంచి లక్ష దాకా వస్తోంది. వాతావరణాన్ని బట్టి ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్‌కు రూ.3వేల నుంచి రూ.4వేల ధర పలుకుతుంది. ఇప్పుడు రూ.5 వేలు ఉంది. ధర ఎంత తక్కువ పలికినా బీర పంటతో నష్టం అనేదే ఉండదు. నేను ఆరేళ్లలో ఖర్చులు పోను రూ.15 లక్షలకు పైగా సంపాదించా. ఎకరం భూమిలో ఇంతకన్నా ఎవరు ఎక్కువ సంపాదిస్తారు ? నేరుగా చిన్న చిన్న వ్యాపారులకు క్వింటాలు, అర క్వింటాల్ చొప్పున సరఫరా చేస్తా. ఇలా అయితే ఎక్కువ లాభం వస్తది.
– తొడుపునూరి వెంకటేశ్, రైతు