నమస్తే తెలంగాణ, నెట్వర్క్ : ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహా శివరాత్రి అత్యంత పవిత్రమైంది. బిల్వ పత్రం సమర్పించి.. కేవలం నీటితో అభిషేకించినా ప్రసన్నమయ్యే శివుని సాన్నిధ్యంలో నేడు భక్తులంతా ఉపవాసం ఉండి, రాత్రి వేళ జాగరణ చేస్తారు. పర్వదినాన ఉదయమే లేచి స్నానం చేసి, పూజలు చేసి, రోజంతా ఉపవాసం, జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథాపారాయణాల్లో లీనమవుతారు. ‘ఓం నమః శివాయః’ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తపస్సు, యోగా, ధ్యానం వంటి అభ్యాసాలతో శివుని సాయుజ్యంలో ఉంటారు.
లింగోద్భవ కాలం
మహా శివరాత్రి రోజున నిశివేళ శివ పూజకు అనువైన సమయం. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించింది ఈ రోజునే కావడంతో శివాలయాల్లో రాత్రి 12గంటలకు అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ చేస్తారు.
రుద్రాభిషేకం
వేద మంత్రాలను రుద్ర సూక్తంగా పఠిస్తూ శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీన్నే రుద్రాభిషేకం అంటారు. మనసులోని మలినాలను తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం.
జాగరణం
ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని మేల్కొలిపి, తానే శివుడై (శివోహం), సర్వాన్ని శివస్వరూపంగా భావించి దర్శించడమే నిజమైన జాగరణం. శివపూజ, శివభజన, శివభక్తులతో కూడి, శివుడి విషయాలు మాట్లాడుకోవడం, శివ ధ్యానం చేయడం ద్వారా శివుని అనుగ్రహం సిద్ధిస్తుంది. జాగరణ సమయంలో భక్తులు ఇండ్లలో, లేద పని ప్రదేశంలోనే శివలింగాన్ని ప్రతిష్టించుకొని పూజలు చేస్తారు.
ఆలయాలు ముస్తాబు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలు ముస్తాబై విద్యుత్ దీపాల కాంతులీనుతున్నాయి. నేటి నుంచి 2వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనుండగా శివనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి, రామప్ప, కురవి వీరభద్రస్వామి, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయాలు సహా అన్ని శైవక్షేత్రాల్లో మహా పూజలు, శివ కల్యాణాలు కనులపండువలా జరుగనున్నాయి.