పోచమ్మమైదాన్, మే 10: పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా వరంగల్ వాసవీకాలనీలోని ఇన్నర్‌వీల్ క్లబ్ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నది. ఇంటి వద్ద పిల్లలు సమయాన్ని వృథా చేసుకోకుండా కమిటీ సభ్యులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఏడాదంతా చదువు సంధ్యల్లో మునిగిన పిల్లలు.. ఇక్కడ కల్పిస్తున్న ఆహ్లాదకర వాతావరణంలో ఆటపాటలతో గడుపనున్నారు. ఆరోగ్యం కోసం యోగాతోపాటు వివిధ రకాల విన్యాసాలు, కళలపై ఆసక్తి పెంచుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు సమ్మర్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లబ్ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదువుతోపాటు విద్యార్థుల మానసికోల్లాసానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్నర్‌వీల్ వ్యవస్థాపక సభ్యురాలు, నేరెళ్ల వేణుమాధవ్ సతీమణి నేరెళ్ల శోభావతి సమక్షంలో కమిటీ సభ్యులు సేవా దృక్పథంతో సమ్మర్ క్యాంపుకు తోడ్పాటు అందిస్తున్నారు.
సంస్థ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు
ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో 1999 నుంచి క్రమం తప్పకుండా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. నాడు 60 మంది పిల్లలతో ఆరంభమైన క్యాంపు నేడు 200 మంది వరకు చేరుకుంది. ప్రస్తుతం 8 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు సమ్మర్ క్యాంపులో అవకాశం కల్పిస్తున్నారు. వీరికి యోగా, డ్యాన్స్, డ్రాయింగ్, మ్యూజిక్, మిమిక్రీ, మ్యాజిక్‌లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే, కొత్తవాడ తోటమైదానంలో ఉదయం వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, స్కిప్పింగ్, టెన్నికాయిట్‌లో శిక్షణ ఇచ్చేందుకు పీఈటీలు సురేశ్, సుదర్శన్ పని చేస్తున్నారు. వీరికి ఇన్నర్‌వీల్ క్లబ్ ద్వారా తగిన పారితోషికం అందజేస్తూ, సమ్మర్ క్యాంపు ముగింపు రోజు విద్యార్థులందరికీ ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు.
పిల్లల సంఖ్య పెరుగుతున్నది
ఏటేటా సమ్మర్ క్యాంపునకు పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం 200 సంఖ్య దాటింది. సరిపోను స్థలం లేకపోవడం వల్ల అందరికీ అవకాశం కల్పించలేకపోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారిలో సృజనాత్మకతశక్తి, స్కిల్స్ పెంచేవిధంగా కృషి చేస్తున్నాం.
– నేరెళ్ల శోభావతి,ఇన్నర్‌వీల్ క్లబ్ వ్యవస్థాపక సభ్యురాలు
సేవాభావంతో పనిచేస్తున్నాం
ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో సేవాభావంతో తమవంతు కృషి చేస్తున్నాం. వ్యవస్థాపకురాలు నేరెళ్ల శోభావతి పర్యవేక్షణలో కమిటీ సభ్యులు కలిసికట్టుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సమ్మర్ క్యాంపుతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపు వల్ల పిల్లలకు ప్రయోజనం కలుగుతున్నది.
– బోగ లక్ష్మి, ఇన్నర్క్లబ్ అధ్యక్షురాలు