దుగ్గొండి, మార్చి 31: యాసంగి సీజన్లో రాష్ట్రంలోని రైతులు పండించిన ధాన్యాన్ని కొనే దాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తేలేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. నాచినపల్లి పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ సుకినె రాజేశ్వర్‌రావు అధ్యక్షతన గురువారం మహాజన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెద్ది హాజరై మాట్లాడారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం పీఏసీఎస్‌ల ద్వారా అన్నదాతల అవసరం మేరకు పంట రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. నాబార్డు నిబంధనల మేరకు అత్యధికంగా రూ. రెండు కోట్ల వరకు అనుమతి సాధించిన సొసైటీలు నర్సంపేట నియోజకవర్గంలోనే ఉన్నాయన్నారు. రైతులకు సకాలంలో అప్పులు అందించడం ఎంత ముఖ్యమో రికవరీ కూడా అంతే ముఖ్యమన్నారు. ధాన్యం నిల్వ కోసం నియోజకవర్గంలోని ప్రతి సొసైటీ పరిధిలో గోదాం నిర్మిస్తున్నామని వివరించారు. ప్రతి మండలంలో 10 వేల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండేలా ప్రతిపాదనలు పంపి మంజూరు చేయించామన్నారు. వెంకటాపురంలో ఐదు వేల టన్నుల మెట్రిక్ టన్నులు, చలపర్తిలో పది వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మించినట్లు వెల్లడించారు. నాచినపల్లి, తిమ్మంపేట, మహ్మదాపురంలో నిర్మాణాలను ప్రారంభించామని చెప్పారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సబ్సిడీ
గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్ల కోసం రూ. 1.40 కోట్ల సబ్సిడీని తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే పెద్ది వెల్లడించారు. అలాగే, రెండు నెలల క్రితం మునుపెన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో వడగండ్ల వానతో పంటనష్టం జరిగిన విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పదించారని పెద్ది తెలిపారు. నష్టపోయిన రైతులందరికీ త్వరలోనే పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, సర్పంచ్ పెండ్యాల మమతారాజు, ఎంపీటీసీ ఎన్ మమతామోహన్, వైస్ చైర్మన్ గుడిపల్లి ధర్మారెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: పెద్ది
నర్సంపేట: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట ఏరియా దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పెద్ది హాజరై మాట్లాడారు. నర్సంపేట దవాఖానను జిల్లాస్థాయి ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ 250 పడకల సామర్థ్యం గల నూతన భవనాల నిర్మాణానికి రూ. 66 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. దవాఖాన అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్‌స్థాయి వైద్య సేవలు అందుతాయన్నారు. నర్సంపేటలో బ్లడ్ బ్యాంక్, ఐసీయూ సేవలు, ఆక్సిజన్, డయాగ్నస్టిక్ సెంటర్‌తోపాటు అంబులెన్స్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కిడ్నీ సంబంధిత రోగుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. నర్సంపేట ఏరియా ఆస్పత్రి ఎదురుగా ఉన్న స్థలంలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ మంజూరైందన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, ఎంపీపీలు విజేందర్, జడ్పీటీసీ సభ్యులు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వీరమల్ల మాధవరెడ్డి, ఐకేపీ, హెచ్‌డీఎస్ సభ్యులు పాల్గొన్నారు.
గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించాలి
గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించాలని గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు గంప రాజేశ్వర్‌గౌడ్, పుట్టపాక కుమారస్వామి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నర్సంపేట శాఖ గ్రంథాలయంలో నూతనంగా నిర్మించిన భవనంపై రీడింగ్ గది, మూత్రశాలల నిర్మాణం, గ్రీనరీ, రోడ్డుపై మొరం పోయించి లెవల్ చేయించేందుకు నిధులు మంజూరు చేయాలని వారు పెద్దిని కోరారు. స్పందించిన ఆయన మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి గ్రంథాలయంలో పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.