
వరంగల్, ఆగస్టు 28: టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, నాయకులపై చౌకబారు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతల్లారా ఖబడ్దార్.. అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తే ఊరుకునేదిలేదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవాకులు, చెవాకులు పేలుస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉనికి కోసమే పాదయాత్రలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దళితుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం చూసి బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
బీజేపీ నాయకులకు చేతనైతే దళిత బంధు పథకాన్ని దేశమంతా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాని ఒప్పించాలని ఆయన సవాల్ విసిరారు. రాజకీయాల కోసం పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాదయాత్రలు చేసినా.. మోకాలు యాత్రలు చేసినా ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ఆ పార్టీలు అధికారంలోకి రావడం భ్రమ అని తేల్చిచెప్పారు. మరో 20 ఏళ్లు తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుతుందని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకు పోతున్నదని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నయా పైసా విడుదల చేసిన దాఖలాలు లేవని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో వేలాది మంది పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోట్లాది రూపాయలు విడుదల చేసి వారి ప్రాణాలను కాపాడుతున్నారని ఆయన చెప్పారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
పశ్చిమ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు చీకటి శారద, సంకు నర్సింగ్, టీఆర్ఎస్ నాయకులు నలుబోల సతీశ్, పులి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.