‘ఈ ఏడాది పత్తి, మిర్చికి డిమాండ్ ఉంటుంది. మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది.. రైతులు గమనించి వీటిని సాగు చేయాలె.. మంచి లాభాలు పొందాలె.’ అని గత వానకాలం ఆరంభంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. ఆయన చెప్పినట్లే ప్రస్తుతం మార్కెట్లో మిర్చి, పత్తికి డిమాండ్ పెరిగింది. మిర్చి ధర పసిడితో పోటీపడుతున్నది. రోజురోజుకూ పైకి ఎగబాకుతున్నది. అన్ని రకాల మిర్చి ధర పరుగులు పెడుతున్నది. రికార్డు స్థాయి ధరలు నమోదవుతున్నాయి. దేశీ రకం మిర్చి ధర క్వింటాల్ రూ.48 వేలకు చేరింది. సింగిల్‌పట్టీ రకం రూ.45వేలు పలికింది. వండర్‌హాట్ రకం మిర్చి గరిష్ఠ ధర రూ.23,500గా నమోదైంది. తేజ, యూఎస్341, దీపిక తదితర రకాల ధరలూ అనూహ్యంగా పెరిగాయి. పత్తి ధర కూడా పైపైకి పోతున్నది. క్వింటాల్ ధర రూ.10,770 పలికింది. మిర్చి, పత్తికి ఇప్పటివరకు నమోదైన ధరలు ఆల్‌టైం రికార్డుగా వ్యాపారులు, మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు.
వరంగల్, మార్చి 22(నమస్తేతెలంగాణ) : రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారిని పంట మార్పిడి దిశగా ప్రోత్సహిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గత వానకాలం సీజన్ ఆరంభంలో పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న, లాభదాయకమైన పంటల సాగును ఎంచుకోవాలన్నారు. ఈ ఏడాది పత్తి, మిర్చికి డిమాండ్ ఉంటుందని, మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉందని చెప్పారు. ఆయన సూచనతో ఈ ఏడాది ఈ రెండు పంటలు సాగు చేసిన రైతులు లాభాలు గడిస్తున్నారు. రికార్డు స్థాయి ధరలను పొందుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు మార్కెట్లో మిర్చి, పత్తికి ఫుల్ గిరాకీ ఉంది. ఇపుడు ఈ రెండింటికీ అధిక ధర పలుకుతున్నది. గతంలో ఉన్న మార్కెట్ రికార్డును తిరుగరాస్తున్నది. పైపైకి పోతున్న ధర అంతకుముందు రోజు పలికిన ధరను బ్రేక్ చేస్తున్నది.
మునుపెన్నడూ లేని ధరలు..
మిర్చి కొనుగోళ్లలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు రాష్ట్రంలో ప్రత్యేకత ఉంది. మరే మార్కెట్లో లేని విధంగా ఈ మార్కెట్లో అన్ని రకాల మిర్చి కొనుగోళ్లు జరుగుతాయి. ఖమ్మం మార్కెట్‌కు సైతం తేజ వంటి ఒక రకం మిర్చి మాత్రమే వస్తది. ఎ నుమాముల మార్కెట్‌కు మాత్రం తేజతో పాటు వండర్‌హాట్, సింగిల్‌పట్టీ, దేశీ, యూఎస్341, దీపిక తదితర రకాల మిర్చిని రైతులు తెస్తున్నారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ మిర్చికి మునుపెన్నడూ లేని ధరలు పలుకుతున్నాయి. గతంలో దేశీ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.18 వేల నుంచి రూ.25 వేలు, వండర్‌హాట్ రకం రూ.14 వేల నుంచి రూ.18 వేలు, తేజ రకం రూ.12 వేల నుంచి రూ.14,500, యూఎస్ 341 రూ.14 వేల నుంచి రూ.17 వేలకు మించలేదు. సింగిల్‌పట్టీ రకం గరిష్ఠ ధర క్వింటాల్‌కు రూ.26 వేలు దాటలేదు. ఈ ఏడాది క్వింటాల్ దేశీ, సింగిల్‌పట్టీ రకం మిర్చికి రూ.26 వేలు, వండర్‌హాట్ రకం మిర్చికి రూ.17 వేలు, తేజ రకానికి రూ.14 వే లు, యూఎస్ 341 రకానికి రూ.17వేల కంటే తగ్గడం లేదు. మిర్చి ధరలో హెచ్చు తగ్గులు ఉంటున్నా గతం లో ఉన్న గరిష్ఠ ధర కంటే ఇప్పుడు నమోదవుతున్న కనిష్ఠ ధర ఎక్కువగా ఉంటుండడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తున్నది.
క్వింటాల్ మిర్చి ధర గతం లో రూ.26 వేలు దాటకపోగా, మంగళవారం అమాం తం రూ.48వేలకు పెరిగింది. సోమవారం ఎనుమాము ల మార్కెట్లో దేశీ రకం మిర్చి క్వింటాల్ ధర రికార్డు స్థాయిలో రూ.45 వేలు పలికింది. ఇదే మిర్చికి ఈ మా ర్కెట్లో గత గురువారం రూ.44 వేలు పలికింది. జ యశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పుల్లూరిరామయ్యపల్లె గ్రామ రైతు పుల్లూరి మాధవరావు 44 బస్తాల దేశీ రకం మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా, అయ్యన్ ట్రేడర్స్ ఖరీదుదారులు క్వింటాల్‌కు రూ.48 వేల చొప్పున కొనుగోలు చేశారు. ఇక్కడ మిర్చి కి పలికిన గరిష్ఠ ధరలను పరిశీలిస్తే క్వింటాల్ సింగిల్‌పట్టీ రకం రూ.45,000, వండర్‌హాట్ రూ.23,500, యూఎస్341 రూ.22,500, తేజ 17,900, దీపిక రకం రూ.25 వేలు పలికింది. మార్కెట్ చరిత్రలో ఎర్రబంగారానికి ఇంత ధర పలకడం ఇదే ఫస్ట్ టైం.
పత్తి ధర పైపైకి..
ఎనుమాముల మార్కెట్లో పత్తి ధర ఏరోజుకారోజు కొత్త శిఖరాలను చేరుతున్నది. మంగళవారం ఏకంగా క్వింటాల్ రూ.10,770 పలికింది. భూపాలపల్లి మండ లం కాశీంపల్లి గ్రామ రైతు చల్ల ఐలయ్య పది బస్తాల పత్తి మార్కెట్‌కు తీసుకురాగా, ఇక్కడి మహాలక్ష్మి కంపె నీ ఖరీదుదారులు క్వింటాల్‌కు రూ.10,770 ధర నిర్ణయించారు. మార్కెట్ చరిత్రలో పత్తికి ఇదే అత్యధిక ధర. అలాగే, సోమవారం ఇదే మార్కెట్లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.10,720 పలికింది. జయశంకర్ భూ పాలపల్లి జిల్లా పెరకపల్లి గ్రామ రైతు అంకతి రాజు 40 బస్తాల ద్వారా తెచ్చిన పత్తికి ఖరీదుదారులు ఈ ధర నిర్ణయించారు. మార్కెట్ చరిత్రలో ఇదే రికార్డు ధర. గత గురువారం ఇదే మార్కెట్లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.10,310 పలికింది. చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామ రైతు జూకంటి శ్రీశైలం తెచ్చిన 30 బస్తాల పత్తికి ఈ ధర లభించింది. 15వ తేదీన పత్తి ధర క్వింటాల్‌కు రూ.10,235 పలికింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం జఫర్గడ్ గ్రామ రైతు జింటబోయిన ప్రభాకర్ ఈ ధర పొందినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు. 14న ఇదే మార్కెట్లో పత్తి క్వింటాల్ గరిష్ఠ ధర రూ.10,210 పలికింది. ఇలా రోజురోజుకూ పత్తి ధర పెరుగుతున్నది. వానలతో పత్తి, మిర్చి పంటల నుంచి దిగుబడులు తగ్గిన నేపథ్యంలో ధరలు పెరుగుతుండడంతో రైతులకు ఊరటనిస్తున్నది.