పచ్చదనం, పరిశుభ్రతతో పాటు అభివృద్ధికి మేము సైతం అంటూ సబ్బండ వర్గాలు భాగస్వాములు అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ‘పల్లె, పట్టణ ప్రగతి’ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటుండడంతో పనులు జోరుగా సాగుతున్నాయి. ఏడో రోజైన బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శ్రమదానాలు చేసి శుభ్రం చేయడంతో పాటు చాలాచోట్ల శిథిలమైన పాత ఇండ్లను కూల్చేశారు. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎక్కడికక్కడ మొక్కలు నాటి ‘హరిత’ ఉద్యమంలో పాల్గొన్నారు.
నమస్తే నెట్వర్క్ : పల్లె, పట్టణ ప్రగతి పనులు ఏడో రోజైన బుధవారం జోరుగా సాగాయి. భూపాలపల్లి మండలం పెద్దాపూర్‌లోని పల్లె ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రారంభించారు. హరితహారంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఫకీరతండా, ముంగిముడుగులో డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ వైకుంఠధామాన్ని ప్రారంభించి, రామన్నగూడెంలో మొక్కలు నాటారు. గూడూరు మండలంతో పాటు ఏపూర్, బొద్దుగొండ గ్రామాల్లో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మొక్కలు నాటారు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లతో పాటు పలు గ్రామాల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని మొక్కలు నాటారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్‌నాగారంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పల్లె నిద్ర చేసి దళితకాలనీలో పర్యటించారు. ఆ తర్వాత గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని గ్రామసభలో పాల్గొన్నారు. గ్రేటర్ 41వ డివిజన్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.