
గీసుగొండ, సెప్టెంబర్ 4 : కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు విద్యను బోధించాలని కలెక్టర్ గోపి అన్నారు. మండలంలోని గంగదేవిపల్లి ప్రభుత్వ జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను శనివారం సందర్శించారు. పాఠశాలోని మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం 10, 5వ, 2వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కాగా, ఇతర గ్రామాల నుంచి పాఠశాలకు వస్తున్నామని, బస్సు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. బస్సు నడిచేలా చూస్తానని, అందరూ తప్పకుండా ప్రతిరోజూ పాఠశాలకు రావాలని ఆయన సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మాస్కులు ధరించాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. రోజూ తరగతి గదులను శానిటైజేషన్ చేయాలన్నారు. పాఠశాల ఆవరణతో పాటు కిచెన్ షెడ్‌ను శుభ్రంగా ఉంచాలన్నారు. ఐఏఏస్ శిక్షణ సమయంలో గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించినట్లు తెలిపారు.
సంగెంలో..
సంగెం : సంగెం మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ గోపి సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. పారిశుధ్యం, శానిటైజేషన్‌కు సంబంధించిన వివరాలను ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిమ్మాపురం, గవిచర్ల గ్రామాల్లోని పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. తిమ్మాపురంలోని మెగా పల్లెప్రకృతి వనంలో మొక్కలు విరివిగా నాటాలని సంబంధిత అధికారులు, ఉపాధిహామీ కూలీలకు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఈవో వాసంతి, ఎంపీపీ కందకట్ల కళావతి, తహసీల్దార్లు సుహాసిని, విశ్వనారాయణ, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో వడ్లూరి ప్రవీణ్‌కుమార్, ఏపీవో మోహన్‌రావు ఎంఈవో విజయ్‌కుమార్, హెచ్ఎం కిరణ్మయి, సర్పంచ్‌లు బాబు, గన్ను శారద, ఎంపీటీసీ మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే చల్లా..
ఖిలావరంగల్ : వరంగల్ జిల్లా నూతన కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బీ గోపిని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన ప్రముఖులు
నర్సంపేట : వరంగల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ గోపిని శనివారం కలెక్టరేట్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని కళాశాలల గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయించాలని కోరారు. ఆయన వెంట బీ చంద్రమౌళి, సమత, జీ వెంకటేశ్వర్లు, సుమతి, ప్రసూన ఉన్నారు.
ఖిలావరంగల్ : కలెక్టర్ గోపిని ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ మండ శ్రీనివాస్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాలు 11, 102 వాహనాలు 9, పార్థివదేహం తరలించే వాహనం ఒకటి, బైక్ అంబులెన్స్ ఒకటి, పశు వైద్యసేవల కోసం మూడు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పేదలకు సత్వర వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు.