లింగాల ఘణపురం : జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని జీడికల్ రోడ్డుకు(Jedical Road) మెయింటెనెన్స్ రూరల్ రోడ్స్ (ఎంఎంఆర్) నిధుల నుంచి రూ.8 కోట్లు మంజూరైనట్లు పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగామ నుంచి కళ్లెం, సిరిపురం, జీడికల్ గ్రామం వరకు ఉన్న డబుల్ బీటి రోడ్డు అధ్వాన్నంగా మారిందన్నారు. ప్రయాణికులు ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతూ నరకయాతన అనుభవించే వారన్నారు.
ఆయా గ్రామాల ప్రజలు రోడ్ల పరిస్థితిపై అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంఎంఆర్.. నిధుల నుండి 8 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ నిధులతో పాత రోడ్డును మొత్తం తొలగించి నూతనంగా జనగామ నుంచి కళ్లెం, సిరిపురం జీడికల్ వరకు డబుల్ బీటీ రోడ్డును వేయిస్తున్నామన్నారు. పనులను అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.