రఘునాథపల్లి మార్చి 6 : గడచిన 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం రఘునాథపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతులకు సరైన కాలంలో నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని అన్నారు. విలువలు మాట్లాడే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఏమాత్రం రాజ్యాంగ విలువలు ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ఆయన నీతి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఏప్రిల్ నెలలో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ పిలుపునిచ్చారని అన్నారు.
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కూడా మళ్లీ ప్రారంభించి మెంబర్షిప్ పూర్తయిన తర్వాత గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి రాష్ట్రస్థాయి వరకు మళ్లీ కొత్తగా కమిటీలు ఏర్పరచుకోబడతాయని అన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ మారపాక రవి, మాజీ జడ్పీటీ సీ బానోతు శారద, మ్యాట్ ఎంపీపీ వై.కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.