బచ్చన్నపేట. మార్చి 7: మండలంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు(Pending salaries) ప్రభుత్వం వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు.
గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రెండవ పీఆర్సీ పరిధిలోకి గ్రామపంచాయతీ సిబ్బందిని తీసుకురావాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలన్నారు. ఇప్పటివరకు పని చేస్తున్న కారోబార్లు. బిల్ కలెక్టర్లు, సఫాయి, ఎలక్ట్రిషన్, వాటర్ మెన్ తదితర సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు. కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించాలన్నారు. కార్యక్రమంలో కొమురెల్లి శ్రీనివాస్, ప్రభాకర్, గొల్లపల్లి బాబు గౌడు, ముక్క నాగయ్య పాల్గొన్నారు.