లారీల రద్దీతో తరచూ ప్రమాదాలు
బ్లాక్ స్పాట్స్ గుర్తించినా తగ్గని వైనం
డ్రైవర్ల నిర్లక్ష్యం.. మితిమీరిన వేగం
మద్యం తాగి నడపడం ప్రధాన కారణం
గాల్లో కలుస్తున్న ప్రాణాలు
వరుస ప్రమాదాలతో ప్రజల్లో ఆందోళన
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 26(నమస్తేతెలంగాణ): జాతీయ రహదారి 353సీ.. అంటేనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. ఎన్‌హెచ్ 353సీ రేగొండ మండలం నుంచి మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జి దాటి మహారాష్ట్రలోకి వెళ్తుంది. ఈ రోడ్డుపై జిల్లాలో ఇసుక, బొగ్గు లారీల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నవంబర్ 14వ తేదీ నుంచి పెద్ద ప్రమాదాలు జరిగాయి. పోలీస్ అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం, నిద్రలేమి, అతివేగం, మద్యం తాగి నడపడం కారణాలు అవుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వారి కుటుంబాలకు శోకం మిగులుస్తున్నాయి.
జిల్లాలోని జాతీయ రహదారి 353సీ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డుపై లారీ ల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నా యి. రేగొండ మండలంలో షురువై మహదేవ్పూర్ మండ లం కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జి దాటి మహారాష్ట్రలోని సిరోంచా తాలూకాలో ఇది ప్రవేశిస్తుంది. ఈ రోడ్డుపై నవంబర్ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు పలు ప్రమాదాలు లారీల కారణంగా చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీస్ శాఖ ఆరు ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ లారీ డ్రైవర్ల అజాగ్రత్త, ఇతర కారణాలతో ప్రమాదాలు జరిగి, పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో ఉన్న రేగొండ ఏఎస్సై అలీ మరణం కూడా జరిగింది.
నిద్రలేమి, మితిమీరిన వేగం
జిల్లాలో జాతీయ రహదారి 353సీపై లారీలు మితి మీరిన వేగంతోపాటు డ్రైవర్లు సుదూర ప్రాంతాల నుంచి రాత్రింబవళ్లు లారీలను నడపడం వల్ల విశ్రాంతి లేక తరుచూ లారీలు ప్రమాదాలకు గురవుతున్నాయి. జిల్లాలో అధికంగా ఇసుక, బొగ్గు రవాణా చేస్తున్న లారీలు ఎక్కువగా ప్రమాదాలకు గురతున్నట్లు సమాచారం. డ్రైవర్లు చాలామంది మద్యం తాగి లారీలను నడపటం వల్లే అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
వరుసగా ప్రమాదాలు
ఈ నెల 13వ తేదీన కాటారం మండలంలోని చింతకాని క్రాస్ రోడ్డు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని సుమారు ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు.
నవంబర్ 28న కాటారం మండలంలోని బావనివాగు సమీపంలో ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. షార్ట్ సర్క్యూట్‌కు గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
నవంబర్ 5న కాటారం మండలం మద్దులపల్లిలో బొగ్గులోడ్‌తో వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంటి ముందు న్న షెడ్ పూర్తిగా కూలింది. ఈ ఘటనలో ఆస్తి నష్టంతోపాటు పలువురికి గాయాలయ్యాయి.
నవంబర్ 7వ తేదీ రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న రేగొండ ఏఎస్సై అలీ వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టింది. విధి నిర్వహణలోనే ఆయన మరణించారు.
మహదేవ్పూర్ మండలం బొమ్మాపూర్ వద్ద లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.
డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే..
జిల్లాలో జరుగుతున్న లారీ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం, మితిమీరిన వేగమే కారణం. జిల్లా వ్యాప్తంగా మద్యం తాగి వాహనాలను నడిపరాదని రోజూ డ్రంకన్ డ్రైవ్ టెస్టులు అమలు చేస్తున్నాం. లారీడ్రైవర్లు మద్యం తాగి వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.